నా చిన్నతనంలో ఇద్దరే హీరోలు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్. కృష్ణ, శోభన్ ఇంకా పాపులర్ కాలేదు. కాంతారావు కత్తి ఫైటింగ్ ఇష్టమే కానీ, ఆయన సినిమాలకు తీసుకెళ్లమని ఇంట్లో వాళ్లని పీక్కుతినే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎన్టీఆర్‌ని అర్థం చేసుకోడానికి పసితనం చాలు. కత్తి పట్టుకునే రాజకుమారుడు, కృష్ణుడు, రాముడు లేదా దుర్యోధనుడు. ఎఎన్ఆర్ సినిమాలు అర్థం కావాలంటే జీవితం తెలియాలి. ఎమోషన్స్, రిలేషన్స్ తెలియాలి.
చిన్నపుడు ఎఎన్ఆర్ పెద్ద ఇష్టం వుండేది కాదు. నాకే కాదు, నా ఈడు వాళ్లందరికీ ఎన్టీఆర్ అంటేనే క్రేజ్. గుండమ్మకథలో మొరటోడు అంజి (ఎన్టీఆర్) నచ్చినట్టుగా అక్కినేని నచ్చడు. మాయాబజార్‌లో అభిమన్యుడు వస్తేనే భయం. పాటలు స్టార్ట్ చేస్తాడని. ఆ సినిమా హీరో ఎస్వీ రంగారావే.
రోజూ ఇలా నడుస్తూ వుండగా దసరా బుల్లోడు ఉప్పెనలా వచ్చి పడ్డాడు. పాటలకి జనం పిచ్చెక్కిపోయారు. ఒక డొక్కు టెంట్‌లో చూసాను. ఆ సినిమా ఆడినన్ని రోజులు రాత్రి 7 నుంచి 8 వరకు టెంట్ బయట రెండు మూడు పాటలు వినేవాన్ని. ఆ రోజుల్లో పాటలు వినాలంటే రేడియోలే దిక్కు. గ్రామ్‌ఫోన్, టేప్‌రికార్డర్లు షావుకార్ల ఇళ్లలోనే కనిపించే కాలం. ఎక్కడైనా పెళ్లి జరిగితే ఆనందం. దసరా బుల్లోడు వినబడని మండపం వుండదు.
తర్వాత ప్రేంనగర్, బంగారుబాబు ఇలా వరుస మ్యూజికల్ హిట్స్. వయసుతో పాటు అభిమానం కూడా పెరిగింది. మూగమనసులు (సెకెండ్ రన్) చూసి మైండ్ పోయింది. ఎఎన్ఆర్, సావిత్రి ఒకర్ని మించి మరొకరు. అక్కినేని ఎంత గొప్ప నటుడో, ఆయన బలం ఏంటో తెలిసింది. ప్రేక్షకులకే కాదు, ఎఎన్ఆర్‌కి కూడా ఆయన బలం తెలుసు. తొలి రోజుల్లో పౌరాణీకాలు చేసినా తర్వాత తగ్గించారు.
అనంతపురంలో అక్కినేని అభిమాన సంఘాలుండేవి. ఫస్ట్ మార్నింగ్ షోకి కటౌట్ పాలాభిషేకాలు, పూలదండలు, అన్నదానాలుండేవి. ప్రేమాభిషేకం శాంతి టాకీస్‌లో ఆడుతున్న రోజుల్లో హౌస్‌ఫుల్‌కి 10 టికెట్లు తగ్గితే వీళ్లే కొని హౌస్‌ఫుల్ బోర్డు పెట్టించే వాళ్లు. ఎవరూ డబ్బున్న వాళ్లు కాదు. చిన్నచిన్న ఆదాయాలతో జీవించేవాళ్లే. అభిమానం అలాంటిది.
ఒక దశలో ఆయన రాజకీయాల్లోకి వస్తాడని అనుకున్నారు. కానీ రాలేదు. వచ్చినా ఎక్కువ రోజులు వుండేవారు కాదు. ఎన్టీఆర్‌లా మొండి మనిషి కాదు, సున్నితం. తాను ఎవర్నీ అనడు. అంటే పడడు.
మేం జర్నలిస్టులుగా వున్నపుడు 2000వ సంవత్సరంలో అక్కినేని తిరుపతి వచ్చాడు. దేవుడంటే నమ్మకం లేదు. ఏదో ప్రోగ్రాంకు అతిథిగా వచ్చాడు. మయూర హోటల్‌లో చిన్న ప్రెస్‌మీట్. ఒకానొక సందర్భంలో ఏదో విషయంలో తప్పు మాట్లాడారని ఒక విలేకరి ప్రశ్నిస్తే అక్కినేని ఏ మాత్రం ఇగో ఫీల్ అవకుండా, చిరునవ్వుతో “నిజమే అప్పుడు నాకు ఆ విషయం తెలియదు” అని ఒప్పుకున్నాడు. చిన్నపిల్లలు ఆశీర్వాదం కోసం వస్తే ఆనందంగా ఫొటోలు దిగారు. ఆ వయసులో కూడా ఆ ఉత్సాహం, చిరునవ్వు, కూల్‌గా మాట్లాడ్డం ఆశ్చర్యంగా అనిపించింది.
అన్నిటికంటే ఆయన ధైర్యం, వ్యక్తిత్వం ఎప్పుడు అర్థమయ్యాయంటే తనకి కాన్సర్ అని విలేకరుల సమావేశంలో ప్రకటించినప్పుడు. మరణం పట్ల ఆయనకి ఏ భయమూ లేదు. మృత్యువుని గౌరవించాడు, ఆహ్వానించాడు.
సెప్టెంబర్ 20 అక్కినేని పుట్టిన రోజు. బతికి వుంటే 99 ఏళ్లు. అక్కినేనికి జననమూ లేదు, మరణమూ లేదు. ఈ భూమిని ప్రేమనగర్ చేయడానికి కొంత కాలం అతిథిగా వచ్చి వెళ్లాడు.
జీఆర్ మహర్షి