ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే సామెత మాదిరిగా రాజకీయ నాయకుల (ఆడవారైనా, మగవారైనా) మాటలకు అర్ధాలు ఏమిటో తొందరగా అర్ధం కావు. ఒక్కోసారి వారు సీరియస్ గా మాట్లాడతారో, నాన్ సీరియస్ గా మాట్లాడతారో, గమ్మత్తుగా మాట్లాడతారో అర్థం కాదు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యవహారం కూడా ఇలాగే ఉంది.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో రేణుకా చౌదరిపై మండి పడ్డాడు. విమర్శలు చేశాడు. దానికి రేణుకా చౌదరి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఆమె అసలే ఫైర్ బ్రాండ్ కదా. ఇలాంటివారు ఆవేశంగా మాట్లాడతారు. ఆ ఆవేశంలో ఏం మాట్లాడుతారో తెలియదు. ఆ మాటలు అర్ధం చేసుకోవాలంటే కష్టం.
వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తాను ఇంత వరకూ ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని ఈ సారి గుడివాడ నుంచి కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని ప్రకటించారు. రేణుకా ఈ ప్రకటన చేయడానికి కారణం.. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చలో ఆమెపై విమర్శలు చేయడమే.
ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కొడాలి నాని వ్యాఖ్యలు వైరల్ కావడంతో రేణుకా చౌదరి స్పందించారు. తనకు ఏపీ రాజకీయాలపై ఇప్పటి వరకూ ఆలోచన లేదని.. కానీ తనను కొడాలి నాని విమర్శించారు కాబట్టి గుడివాడలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.
తనకు తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా అక్కర్లేదనన్నారు. తాను అమరావతి రైతులకు మాత్రమే మద్దతు తెలిపానని టీడీపీకి కాదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యానని గుర్తు చేశారు.
కొడాలికి తన చరిత్ర తెలియదని గూగుల్‌లో సెర్చ్ చేస్తే- తానేమిటో తెలుస్తుందని అన్నారు. ఖమ్మంలోనే గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే తాను ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు.తన కేరీర్‌లో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఇప్పుడా కొరతను గుడివాడతో తీర్చుకుంటాననీ చెప్పారు.
కార్పొరేటర్, ఎంపీ, కేంద్ర మంత్రిగా పని చేశానే తప్ప ఎమ్మెల్యేగా లేనని అన్నారు. గుడివాడలో తాను గెలిచి చూపిస్తానని, ఆ తరువాత కొడాలి నానిని మళ్లీ ఓటర్లు ఎన్నుకోరని జోస్యం చెప్పారు. కొడాలి నాని వచ్చి ఖమ్మం జిల్లా గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో, తన శక్తి సామర్థ్యాలేమిటో ఆయనకు బోధపడుతుందని రేణుకా చౌదరి అన్నారు. వాస్తవానికి రేణుక.. తెలంగాణకు చెందిన నాయకురాలు. అదేసమయంలో నాని.. ఏపీ నాయకుడు. పైగా ఇద్దరికి ఎక్కడా సాపత్యం లేదు.
అంటే.. ఇద్దరివీ చెరోదారులు. ఆమె కాంగ్రెస్.. ఈయన గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ. అయినా.. కూడా ఇద్దరి మధ్యమాటల తూటాలు పేలాయి. దీనికి కారణం.. ఆది నుంచి కూడా నాని.. అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. కానీ, రేణుక మాత్రం.. ఇక్కడ రైతులకు సానుభూతి చూపిస్తున్నారు. ఇటీవల అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. స్వయంగా రథం నడిపి ఉత్సాహపరిచారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటే టీడీపీకి సపోర్ట్ చేసినట్టేనా అని ప్రశ్నించారామె.
ఖమ్మంలోనే గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే తాను ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు. గుడివాడలో పోటీ విషయంలో ఆమె ఎంత సీరియసో తెలియదు. సీరియస్ అయితే మాత్రం పోటీ రంజుగా ఉంటుందని అనుకోవచ్చు.