రాజ‌కీయ తెర‌పైకి మ‌రో వార‌సుడు

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయ తెర‌పైకి మ‌రో వార‌సుడు రానున్నారు. ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో భూమా కుటుంబానికి వ్య‌తిరేకంగా రాజ‌కీయ గుర్తింపు పొందిన గంగుల కుటుంబం నుంచి వార‌సుడు రానున్నారు. మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి…

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయ తెర‌పైకి మ‌రో వార‌సుడు రానున్నారు. ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో భూమా కుటుంబానికి వ్య‌తిరేకంగా రాజ‌కీయ గుర్తింపు పొందిన గంగుల కుటుంబం నుంచి వార‌సుడు రానున్నారు. మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి త‌న‌యుడు గంగుల ఫ‌ణికృష్ణారెడ్డి తండ్రి వార‌సత్వంగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం గంగుల ప్ర‌తాప్‌రెడ్డి బీజేపీలో ఉంటున్నారు. ఆ పార్టీలో ఆయ‌న‌ యాక్టీవ్‌గా క‌నిపించ‌డం లేదు. పైగా ఆ పార్టీలో త‌న కుమారుడికి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని భావించ‌డం లేదు.

గంగుల ప్ర‌తాప్‌రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక వ‌ర్గం, గుర్తింపు క‌లిగి ఉన్నారు. ప్ర‌తాప్‌రెడ్డి త‌మ్ముడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైసీపీలో ఉంటూ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. ప్రభాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు గంగుల బిజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాటి మంత్రి భూమా అఖిల‌ప్రియ‌పై బిజేంద్ర ఘ‌న విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

గంగుల ప్ర‌తాప్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య కుటుంబ ప‌ర‌మైన విభేదాలున్నాయ‌ని స‌మాచారం. అవే ఇద్ద‌ర్ని వేర్వేరు రాజ‌కీయ పార్టీల్లో కొన‌సాగేలా చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ప్ర‌తాప్‌రెడ్డి అంటే ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఈ రోజుకు ఎంతో గౌర‌వ మ‌నే టాక్. మ‌రోవైపు బిజేంద్ర‌నాథ్‌రెడ్డి వైసీపీ పెద్ద‌లు ఆశించిన‌ట్టు ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్ల‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఏదైనా అడిగితే… సొంత నిర్ణ‌యాలు తీసుకోలేర‌నే విమ‌ర్శ బ‌లంగా ఉంది. తండ్రి కాకుండా కుటుంబంలోని ఇత‌ర స‌భ్యుల స‌ల‌హా తీసుకుని చెబుతాన‌ని బిజేంద్ర అంటార‌ని వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట‌.

దీంతో గంగుల ప్ర‌తాప్‌రెడ్డి నాయ‌క‌త్వానికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో తండ్రి ప‌లుకుబ‌డిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌తాప్‌రెడ్డి త‌న‌యుడు ఫ‌ణికృష్ణారెడ్డి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఫ‌ణికి ఆయ‌న‌ మామ క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయి. వీర‌శివారెడ్డి ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. 

గ‌త కొంత కాలంగా ఫ‌ణికృష్ణారెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌డావుడి చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఫ‌ణి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎక్క‌డ చూసినా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫ్లెక్సీలు, పోస్ట‌ర్లు వెలిశాయి. పైగా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అనుచ‌రులే ఫ‌ణి పుట్టిన రోజు వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేయ‌డం ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుంబంతో పోల్చుకుంటే ఆర్థికంగా ప్ర‌తాప్‌రెడ్డి కుటుంబం బ‌లంగా ఉంది. పైగా తండ్రి రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా వ్య‌వ‌హరించేట‌ప్పుడు… ఫ‌ణికృష్ణారెడ్డి జ‌నంతో మ‌మేక‌మ‌య్యేవారు. నాటి ప‌రిచ‌యాలు భ‌విష్య‌త్‌లో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఫ‌ణి భావిస్తున్నార‌ని స‌మాచారం. 

ఈ నేప‌థ్యంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో త్వ‌ర‌లో కార్యాల‌యాన్ని ప్రారంభించి ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ముమ్మ‌రం చేశార‌ని స‌మాచారం. గంగుల కుటుంబంలో ఆధిప‌త్య వార‌స‌త్వ రాజ‌కీయం చివ‌రికి ఎవ‌రిని నిలుపుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.