ఓటీటీ రాకతో ఓ వైపు ప్రయోగాలు చేయడానికి అవకాశం దక్కిందంటున్న కాజల్, మరోవైపు ఇదే ఓటీటీ థియేటర్ వ్యవస్థను మింగేసిందని అభిప్రాయపడుతోంది. చాలా మంది ఇళ్లలో ప్రశాంతంగా కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారని, ఇది థియేటర్లకు మంచిది కాదని అభిప్రాయపడింది.
“కరోనా వల్ల ఫిలిం, టెలివిజన్ ఇండస్ట్రీలు బాగా దెబ్బతిన్నాయి. అదే టైమ్ లో ఓటీటీ వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అధిగమించింది. ప్రజలు తమ ఇంట్లో కూర్చొని కంటెంట్ చూడ్డానికి అలవాటు పడ్డారు.”
అదే టైమ్ లో థియేటర్ల మనుగడపై తన ఉద్దేశాన్ని బయటపెట్టింది కాజల్. ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు తాత్కాలికం అంటోంది. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే ఆధిపత్యం అని చెబుతోంది.
“సినిమా థియేటర్ అనుభవం పూర్తిగా కనుమరుగైపోతుందని నేను భావించడం లేదు. అదెప్పుడూ సమాజంలో ఉంటుంది. ఎప్పుడైతే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో అప్పుడు, ప్రేక్షకులు ఓటీటీని పక్కనపెడతారని అనుకుంటున్నాను.”
అయితే కాజల్ మాత్రం థియేటర్ వ్యవస్థతో పాటు ఓటీటీ కూడా ఉండాలని కోరుకుంటోంది. సిల్వర్ స్క్రీన్ పై చేయలేని ప్రయోగాల్ని తను ఓటీటీలో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ డ్రామా చేసిన ఈ హీరోయిన్.. త్వరలోనే మరో ఓటీటీ వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొస్తానంటోంది.