మార్పు మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో మార్పు కోసం ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంచడం మరీ మంచిది. ఉదాహరణకు ఏపీలో ఇసుక పంపిణీ విధానంలో వైసీపీ వచ్చిన తర్వాత జరిగిన మార్పులు, చేర్పులు చాలా ఎక్కువ, కానీ ఫలితం ఉందా అంటే అధికారపక్షమే బిత్తర చూపులు చూడాల్సిన పరిస్థితి.
పోనీ ఇసుక అంటే రోజుకో విధానం ప్రవేశపెట్టినా ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. కానీ అత్యంత కీలకమైన విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ మార్పులకు మంచి మార్కులు పడ్డాయా..? జనం జగన్ ని పది కాలాలపాటు గుర్తు పెట్టుకుంటారు. పొరపాటున ఈ మార్పులతో జగన్ ఫెయిల్ అయితే ఇప్పటి వరకు ఆయన సంపాదించుకున్న మంచి పేరు మొత్తం పోతుంది.
గతంలో సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే పెద్ద రచ్చ జరిగింది. తెలుగుని చంపేస్తున్నారంటూ రాద్ధాంతం చేశారు కొంతమంది. కోర్టులో కేసులున్నా జగన్ ముందుకే అన్నారు. అవసరమైతే మండలంలో ఒకచోట పూర్తి తెలుగు మీడియం స్కూల్స్ పెడతాం, అక్కడికి రవాణా సౌకర్యం కూడా ఉచితం అంటూ వెసులుబాటు చూపించారు. కానీ ఆ లాజిక్ పెద్దగా పనిచేయలేదు.
కరోనా కాలం రావడంతో ఈ సమస్య కాస్త సద్దుమణిగింది కానీ, లేకపోతే ఈ పాటికే తెలుగు ప్రేమికులు ఉద్యమాలు మొదలు పెట్టేవారేమో. అయితే ఇంగ్లిష్ మీడియం బోధనను సమర్థించుకోడానికి సీబీఎస్ఈ సిలబస్ ని తెరపైకి తెచ్చి వైసీపీ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది.
ఇకపై ఏపీలో 6 రకాల స్కూల్స్..
మీడియం వివాదాన్ని పక్కనపెడితే ఇప్పుడు ఏకంగా స్కూల్స్ ని 6 రకాలు వర్గీకరించి మరో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. గతంలో చర్చలకే పరిమితమైన ఈ అంశాన్ని, సీఎం జగన్ అధికారికంగా ప్రకటించేశారు. మనందరికీ తెలిసి ఎలిమెంటరీ స్కూల్, హైస్కూల్ ఈ రెండే ఉండేవి.
కొన్నిచోట్ల అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉండేవి కానీ కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి. ఆ తర్వాత అంగన్వాడీ స్కూల్స్ కి కాస్త ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు ఇవేవీ లేకుండా ఆరు రకాలంటున్నారు. వీటిని జనం గుర్తించే సరికి ఎంతకాలం పడుతుందో, నిజంగా అవి సక్సెస్ అవుతాయో లేదో తేలాల్సి ఉంది.
శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్.. అంటూ ఆరు రకాలుగా ప్రభుత్వ స్కూళ్లను వర్గీకరిస్తున్నారు. నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ స్కూల్స్ ని ఎలిమెంటరీ స్కూల్స్ లో కలిపేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్రడీ ఏపీలో ఉద్యమం మొదలైంది. అంగన్వాడీ కార్యకర్తలు తమ పొట్టకొడుతున్నారంటూ రోడ్డెక్కారు.
ఇప్పుడు కొత్తగా ఆరు రకాల స్కూల్స్ అనేసరికి టీచర్లలో కంగారు మొదలైంది. ఎవరిని ఎక్కడికి పంపిస్తారు, రేషనలైజేషన్ పేరుతో భారీగా ట్రాన్స్ ఫర్లు ఉంటాయేమోనని హడలిపోతున్నారు. పని ఒత్తిడి పెరుగుతుందని మరింత గాభరా పడుతున్నారు. సజావుగా సాగుతున్న స్కూలింగ్ విధానంలో సడన్ గా ఈ మార్పు ఏంటని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
6 రకాల స్కూల్స్ పేరుతో అయోమయం ఎక్కువవుతుందని వాదించేవారూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ని ఎలా వర్గీకరిస్తారు, వాటి సంగతేంటని కొంతమంది అడుగుతున్నారు.
అయితే ఈ అపోహలన్నీ పరిష్కరించే బాధ్యత ఉన్నతాధికారులపై పెట్టారు సీఎం జగన్. ఏపీ విద్యా వ్యవస్థలో జగన్ తీసుకురాబోతున్న మార్పు మంచిదా, కాదా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలమే వైసీపీ భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది.