ఏపీలో కనీసం నైట్ కర్ఫ్యూ సడలించడానికి ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. తమిళనాడులో కొన్నిచోట్ల పగటిపూట కూడా కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీ, తమిళనాడులో కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల లేకపోయినా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం వాటా ఉన్న కేరళ మాత్రం డోంట్ కేర్ అంటోంది. తాజాగా అక్కడ ఓనమ్ పండగకి గేట్లు బార్లా తెరిచేసింది ప్రభుత్వం.
ఈనెల 12 నుంచి 23 వరకు కేరళలో ఓనమ్ పండగ జరుగుతుంది. దీనికోసం ఈరోజు(ఆగస్ట్-5) నుంచే కేరళ సర్కారు ఆంక్షలు సడలించింది. షాపింగ్, తదితర అవసరాల కోసం అన్ని షాపింగ్ మాల్స్, దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం లాక్ డౌన్ ఉంటుంది.
ఇక ఓనమ్ సందడి మొదలయ్యే 12వ తేదీ నుంచి ఆదివారాలు కూడా నో లాక్ డౌన్. 12 నుంచి 23వ తేదీవరకు వారంలో అన్ని రోజులు షాపులు ఓపెన్ లోనే ఉంటాయని సెలవిచ్చారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.
బక్రీద్ అనుభవం ఏం చెబుతోంది..?
గతంలో బక్రీద్ పండగ సందర్భంగా కేరళలో ఆంక్షలు సడలించారు. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. కేసులు పెరిగితే ఎవరిది బాధ్యత అంటూ నిలదీసింది. కేంద్ర మంత్రులు కూడా ఆంక్షల సడలింపుపై ఆందోళన వెలిబుచ్చారు. కానీ ఇవేవీ పట్టనట్టు వ్యవహరించారు సీఎం పినరయి విజయన్. ఫలితం తెలిసిందే.
కేరళలో కేసులు సంఖ్య భారీగా పెరిగింది. రోజుకి 20వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని కొవిడ్ కేసుల్లో 49.85శాతం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1.7 లక్షలకు ఎగబాకింది. ఈ దశలో ఓనమ్ పండగకి కూడా ఆంక్షలు సడలిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.