ఇప్పటి వరకూ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అత్యధిక పతకాలు దక్కింది లండన్ ఒలింపిక్స్ లో. 2012లో జరిగిన ఆ ఒలింపిక్స్ లో భారత బృందం మొత్తం ఆరు పతకాలను నెగ్గింది. అంతకు ముందు జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో మూడు పతకాలను నెగ్గిన భారత బృందం, లండన్ లో ఆ సంఖ్యను రెట్టింపు చేసింది.
ఇప్పటి వరకూ లండన్ ఒలింపిక్సే భారత్ కు ది బెస్ట్. అయితే అప్పుడు స్వర్ణపతకం లేదు. బీజింగ్ లో అభినవ్ బింద్రా ఒక స్వర్ణపతకాన్ని సాధించాడు. అయితే లండన్ లో భారత బృందంలో ఒక్కరు కూడా అలాంటి ఫీట్ ను రిపీట్ చేయలేదు.
లండన్ లో వచ్చిన ఆరు పతకాల్లో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. అలా ఆరు పతకాలతో జాబితాలో 56వ స్థానంలో నిలిచింది భారత బృందం. లండన్ ఒలింపిక్స్ లో భారత్ తరఫున సుమారు 80 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు భారత ప్రాతినిధ్యం 120 మందికి పెరిగింది.
ప్రస్తుతం పతకాల సంఖ్య విషయానికి వస్తే ఇప్పటి వరకూ నాలుగు పతకాలు భారత ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఒక రజతం, మూడు కాంస్య పతకాలున్నాయి. ఈ సంఖ్య అయితే పెరుగుతుంది. అది లండన్ నంబర్ ను పెరిగితే మంచి ప్రోగ్రెస్ అవుతుంది.
ఇంకా విమెన్ హాకీలో, రెజ్లింగ్ లో, గోల్ఫ్, జావెలిన్ త్రో లో భారత్ కు పతకాల అవకాశాలు మిగిలి ఉన్నాయి. రెజ్లింగ్ లో రెండు పతకాల అవకాశాలున్నాయి. వీటిల్లో ఒకటి స్వర్ణం కోసం పోటీ. రవి దహియ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తే స్వర్ణం సొంతమవుతుంది. బీజింగ్ లో అభినవ్ బింద్రా తర్వాత భారత్ కు ఏ విభాగంలోనూ మళ్లీ స్వర్ణం దక్కలేదు. ఆ లోటును రవి దహియ పూడ్చే అవకాశం ఉంది. స్వర్ణపతకం సాధిస్తే.. లండన్ కన్నా టోక్యోలో భారత్ కు మెరుగైన స్థానం దక్కే అవకాశం ఉంది.