ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులో అసహనం పెచ్చుమీరుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనను ఉద్దేశించి పిచ్చోడి చేతిలో రాయి అని అన్నారట. దానిని అసెంబ్లీలో అని చూడాల్సింది. అప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,…

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులో అసహనం పెచ్చుమీరుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనను ఉద్దేశించి పిచ్చోడి చేతిలో రాయి అని అన్నారట. దానిని అసెంబ్లీలో అని చూడాల్సింది. అప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా సమాధానం ఇచ్చేవారో తెలిసేది? విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను ఇష్టం వచ్చినట్లు చేసుకుని ప్రజాదనం పెద్దఎత్తున వృదా అయ్యేటట్లు చేసిన చంద్రబాబు పాలన గొప్పదట. అందులో ఉన్న లొసుగులను సరిచేసి, విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణాలను వెలికితీసి, కొనుగోలు రేట్లు తగ్గించడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందట.

ఒకప్పుడు సౌర, పవన్‌ విద్యుత్‌ యూనిట్‌ రేట్లు అధికంగా ఉండవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక, వాటి రేట్లు గణనీయంగా తగ్గాయి కదా.. అయినా అధిక రేట్లకే గత ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల నుంచి కొనుగోలు యత్నం చేసింది? రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రాంతానికి జరిగిన ప్రధాన ప్రయోజనం విద్యుత్‌ మిగులులో ఉండడం. అయినా ఏపీ ప్రభుత్వం అవసరం లేకపోయినా ఎందుకు బయట నుంచి ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపింది? అధిక రేట్లకు సౌర, పవన్‌ విద్యుత్‌ సంస్థలతో ఒప్పందాలకు వెళ్లింది? ఇందులో ఆంతర్యం తెలుసుకోవడం కష్టంకాదు.

ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ పీపీఏల విషయంలో మొదటి నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందులో జరిగిన అవినీతి అనండి.. అధిక చెల్లింపులు అనండి.. వాటి గురించి ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం సవివరంగా మీడియాకు వివరించారు. కేంద్రం నుంచి వచ్చిన ఒక లేఖను ఆసరాగా చేసుకుని చంద్రబాబు పిచ్చోడి చేతిలో రాయి అని వ్యాఖ్యానించారు. నిజమే జనం తమ ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా చంద్రబాబు పాలన పిచ్చోడి చేతిలో మాదిరి జరిగిందని స్పష్టంగానే తీర్పు ఇచ్చారు. అయినా చంద్రబాబు అదేదో తనకు వర్తించని తీర్పు అనుకున్నట్లుగా మాట్లాడుతున్నారు.

చంద్రబాబు ప్రచారం మాత్రం తనంత సమర్థుడు ప్రపంచలోనే లేడని చెబుతారు. అంత సమర్థత ఉంటే ఇవ్వాళ డిస్కంలు 20 వేలకోట్ల మేర ఎందుకు బాకీలు పడ్డాయి. తనకు విద్యుత్‌ రంగంతో అపార అనుభవం ఉందనికదా చంద్రబాబు చెప్పుకునేది. మరి అలాగైతే ఇంత భారీగా బకాయిలు ఎందుకు పేరపెట్టారు… దీనిని సమర్థపాలన అంటారా? పిచ్చోడి చేతిలో రాయి మాదిరి పాలన అంటారా? కేంద్రం ఏమని లేఖ రాసింది? పవర్‌ పర్చేజ్‌ ఒప్పందాలను రద్దు చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాసింది. అసలు కేంద్రమంత్రి ఇలాంటి లేఖలు రాయవలసిన అవసరం ఏమి వచ్చిందో తెలియదు.

ఏమైనా రాష్ట్రం సలహా అడిగిందా? అదేమీలేదు కదా? ఇంకా సమీక్ష చేస్తున్న తరుణంలోనే ఇలా రాసిందంటే ఎవరో కేంద్రమంత్రిని ప్రభావితం చేసి ఉండాలి. అన్నిటిలోను ఇంత త్వరగా స్పందిస్తున్నారా? చంద్రబాబు పాలన పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉన్నా, లేకపోయినా ఆయా వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో, ఆయాచోట్ల కోవర్టులను పెట్టడంలో మాత్రం దిట్ట అన్న పేరు పొందారు. అందువల్లే కేంద్రం నుంచి కూడా ఇలాంటి లేఖ వచ్చిందా? అన్న అనుమానం కలుగుతోంది. ఇదంతా చంద్రబాబు ట్రాప్‌ అని, కేంద్రం అవినీతిని సమర్థిస్తూ లేఖ రాయలేదని బీజేపీ నేతలు వాపోవలసి వస్తోంది.

ఇక్కడ సమస్య ఏమిటి. చౌకగా విద్యుత్‌ అందుబాటులోకి వస్తున్నా, దానిని వదలి, అధికరేట్లకే విద్యుత్‌ కొనాలన్న ఒప్పందాలనే కొనసాగించాలా? అలా చేయకపోతే పిచ్చోడి చేతిలో పాలన అవుతుందా? అంటే రేట్లు పెంచితే తెలివైనవాడు? లేకుంటే పిచ్చోడవుతారా. ఇదెక్కటి పిచ్చి సిద్ధాంతం? సుమారు  నాలుగున్నర రూపాయలు పెట్టి యూనిట్‌ విద్యుత్‌ను కొనడం మంచిదా? లేక రెండున్నర పెట్టి కొనడం మంచిదా? ఒకవేళ ఒప్పందాల ప్రకారం ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించి, విద్యుత్‌ సంస్థల వారికి నష్టంలేకుండా, ప్రజలపై భారం లేకుండా చేయడం మంచిదా? కాదా?

ఇందులో ప్రభుత్వ జనరేషన్‌ యూనిట్లను వదలి ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు మతలబు ఏమిటి? అవసరం ఉన్నా, లేకున్న అధిక విద్యుత్‌ను ఎందుకు ఇంతకాలం తీసుకున్నారు? వీటన్నిటిని పరిశీలిస్తే చంద్రబాబు ప్రభుత్వం పిచ్చితనంతోనే కాదు.. అవినీతికి అంతులేకుండా చేసిందన్న అనుమానం కలగడం లేదా? పైగా చంద్రబాబు చేస్తున్న పిచ్చి వ్యాఖ్యలు దానిని బలపరుస్తున్నట్లుగా లేవా? ఏదైనా చంద్రబాబు సలహా ఇవ్వదలిస్తే ఏమనిచెప్పాలి? తాజా పరిస్థితుల ప్రకారం ప్రజలకు భారం తగ్గించడానికి వీలుగా పీపీఏలను సరిచేయండి.. అటు ఉత్పత్తిదారులకు, ఇటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు చేయండి అనిచెబితే పద్దతిగా ఉండేది.

కాని అచ్చం ప్రైవేటు కంపెనీలవారికి వత్తాసు పలుకుతూ పిచ్చోడిచేతిలో రాయి అంటూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారనుకోవాలి. అదే సమయంలో జగన్‌ ఈ పీపీఏలను సమీక్షించి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ఏడాదికి 2500 కోట్ల మేర అంటే ఐదేళ్లకు సుమారు 12,500 కోట్ల మేర ఆదా చేయగలిగితే అది గొప్ప విజయమే అవుతుంది. నిజంగానే ప్రజల పక్షాన నిలిచినట్లు అవుతుందని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది