41 యేళ్ల త‌ర్వాత‌.. ఒలింపిక్స్ హాకీలో ఇండియా ప‌త‌కం!

ఒక‌ప్పుడు ఒలింపిక్స్ హాకీలో ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని సాగించిన భార‌త్.. 41 యేళ్ల విరామం అనంత‌రం తొలిసారి ఒక ప‌తకాన్ని గెలిచింది. కాంస్య‌మే అయినా… ద‌శాబ్దాల క‌ల‌ను నెర‌వేర్చుకుంది ఇండియ‌న్ హాకీ టీమ్. సెమిఫైన‌ల్ కు చేరి…

ఒక‌ప్పుడు ఒలింపిక్స్ హాకీలో ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని సాగించిన భార‌త్.. 41 యేళ్ల విరామం అనంత‌రం తొలిసారి ఒక ప‌తకాన్ని గెలిచింది. కాంస్య‌మే అయినా… ద‌శాబ్దాల క‌ల‌ను నెర‌వేర్చుకుంది ఇండియ‌న్ హాకీ టీమ్. సెమిఫైన‌ల్ కు చేరి ప‌త‌కంపై ఆశ‌లు రేపిన భార‌త జ‌ట్టు, సెమిస్ లో ఓడినా.. కాంస్యం కోసం పోరాడేందుకు అర్హ‌త పొందింది.  జ‌ర్మ‌నీతో జ‌రిగిన బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పూర్తి కాన్ఫిడెన్స్ తో ఆడింది. 5-4 గోల్స్ తేడాతో విజ‌యం సాధించి, కాంస్య ప‌త‌కాన్ని పొందింది.

41 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒలింపిక్స్ లో భార‌త్ కు హాకీలో ద‌క్కిన ప‌త‌కం ఇది. చివ‌రి సారిగా 1980 మాస్కో ఒలింపిక్స్ లో భార‌త జ‌ట్టు స్వ‌ర్ణ‌ప‌త‌కాన్ని పొందింది. అదంతా ఇండియ‌న్ హాకీ స్వ‌ర్ణ‌యుగం. ఆ త‌ర్వాత ఇండియ‌న్ హాకీ విజ‌యాల విష‌యంలో ప‌త‌నావ‌స్థ‌ను ఎదుర్కొంది. ప్ర‌త్యేకించి ట‌ర్ఫ్ ల‌పై భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న క్ర‌మంగా మ‌స‌క‌బారింది. అంత‌ర్జాతీయంగా పెరిగిన ఫిట్ నెస్ ప్ర‌మాణాల‌కు భార‌త ఆట‌గాళ్లు నిల‌వ‌లేక‌పోయారో, లేక క్రికెట్ మ‌త్తులో ప‌డిపోయి హాకీని భార‌తీయులు పూర్తిగా మ‌రిచిపోతూ వ‌స్తుండ‌ట‌మే జ‌రిగిందో కానీ.. హాకీలో మాత్రం మ‌రీ చెప్పుకోద‌గిన విజ‌యాలు లేకుండా పోయాయి.

అడ‌పాద‌డ‌పా మాత్రం మెర‌వ‌డం, ఆ త‌ర్వాత వెనుక‌బ‌డ‌టం భార‌త హాకీ జ‌ట్టు అల‌వాటుగా మారింది. ప్ర‌త్యేకించి ఒలింపిక్స్ లో అయితే ప్ర‌తిసారీ రిక్త‌హ‌స్తాల‌తో రావ‌డ‌మే జ‌రుగుతూ వ‌చ్చింది. క‌నీసం సెమిస్ స్థాయికి చేర‌డం కూడా భార‌త్ కు దాదాపు నాలుగు ద‌శాబ్దాల పాటు సాధ్యం కాలేదు. పది ఒలింపిక్స్ ల‌లో అలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చిన టీమిండియా, ఎట్ట‌కేల‌కూ ఈ సారి చ‌రిత్ర‌ను మార్చింది, ఒక‌ప్ప‌టి చ‌రిత్ర‌కు చేర‌వ‌య్యింది.

హాకీ టీమ్ గెలిచింది కాంస్య‌మే క‌దా అనే చిన్న‌చూపు కూడా అవ‌స‌రం లేదు. ఎందుకంటే కాంస్యం కూడా ఇండియాకు అపురూప‌మే. ప్ర‌త్యేకించి సుదీర్ఘ విరామం అనంత‌రం గెలిచిన కాంస్యం.. స్వ‌ర్ణానికి ఏ ర‌కంగానూ త‌క్కువ కాదు. ఇక హాకీలో మ‌రో ప‌త‌కం ఆశ‌లు కూడా ఉన్నాయి. మ‌హిళ‌ల హాకీ టీమ్ కూడా సెమిస్ కు చేరి, ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. విమెన్ హాకీ టీమ్ కూడా కాంస్యం కోసం మ్యాచ్ ఆడ‌నుంది.