Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెనక్కితిరిగి చూడాలి జగన్ జీ

వెనక్కితిరిగి చూడాలి జగన్ జీ

ఏ మీడియా అయినా మనుగడ సాగించాలంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. ప్రజల పక్షం వహించాల్సిందే. ప్రభుత్వంలో జరిగే లోటు పాట్లను ఎత్తి చూపాల్సిందే. వ్యక్తిగత ఎజెండా కావచ్చు, పార్టీల పక్షపాతం వుండొచ్చు. కానీ తమ ఎజెండాలో భాగంగా వెలికి తీసే నిజాలు కొన్నయినా ప్రజలకు కనువిప్పు కలిగిస్తాయి. నిజాలు బయటకు లాగుతాయి. 

చంద్రబాబు హయాంలో సాక్షి చేసింది ఇదే. తమ మీడియా అధినేత జగన్ నడుపుతున్న పార్టీ కోసమే కావచ్చు. మీడియా ప్రతిపక్షపాత్ర అనేది సమర్థవంతంగా పోషించింది. అనేక విషయాలు బయటకు లాగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండడంతో, దాని అనుకూల పత్రికలు అన్ని వ్యవహారాలు కప్పిపుచ్చుతూ వుండడంతో, వాటి అసలు రంగులను సాక్షిలో వెల్లడిచేసారు.

ఇప్పుడు టేబుల్ టర్న్ అయింది. వైకాపా అధికారంలోకి వచ్చింది. తేదేపా ప్రతిపక్షంలో కూర్చుంది. ఇప్పుడు వైకాపా సాక్షి మీడియాకు పని తగ్గింది. తేదేపా అనుకూల మీడియాకు పని పెరగింది. ఏ మీడియా అయినా సర్వాంతర్యామి కాదు. ఇన్ఫార్మర్లు లేకుండా ఏ రిపోర్టర్ వార్తలు తెచ్చేయడం అసాధ్యం. 

గత అయిదేళ్లలో సాక్షి మీడియా ప్రతినిధులు ఏ విధంగా అయితే సమాచార సేకరణ చేసారో ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అదే విధంగా సమాచార సేకరణ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి సమాచారం లీక్ చేస్తున్నారనే నెపంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగిపోయింది. 

సమాచారం లీక్ ఇవ్వడం అన్నది ఉద్యోగుల డ్యూటీ చాప్టర్ ప్రకారం తప్పిదమే కావచ్చు. కానీ అంత మాత్రం చేత వాళ్లే లీక్ ఇచ్చారని నిర్థారణకు రావడం సరి కాకపోవచ్చు. లేదా వాళ్లే లీక్ ఇచ్చినా, అదేమీ విదేశీ గూఢచారులకో, రాష్ట్రానికి హాని కలిగించే సంఘ విద్రోహ శక్తులకో కాదు. మీడియాకు మాత్రమే. 

ఇలా మీడియాకు లీకులు ఇవ్వడం మీద ఆంక్షలు విధించడం ప్రారంభిస్తే, ఇక మీడియాలో ప్రెస్ నోట్ లు రాసుకోవడం తప్ప వేరే పని వుండదు. గత ప్రభుత్వ కాలంలో ఈ లెక్కన చూస్తే సాక్షి రాసిన వార్తలకు చంద్రబాబు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసి వుండాలి? చంద్రబాబు ఇలా చేసి వుంటే సాక్షికి ఒక్క వార్తయినా దొరికేదా?

భయపెట్టి పాలించాలనుకోవడం ఎప్పటికీ ఎక్కడా సరైనది కాదు. ఈ విషయం జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచింది. . ఇలా చేస్తే మరిన్ని లీకులు మరింత పకడ్బందీగా బయటకు వచ్చే ప్రమాదం ఎప్పుడూ  వుంటుంది. ముఖ్యంగా ఉద్యోగులను భయపెట్టి, ఇరుకునపెట్టి, బాధపెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలా చరిత్రలో లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?