అమరరాజాకి కూడా ‘కమ్మ’ రంగేనా?

అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కాకుండా కేవలం పాక్షిక రాజధానిగానే పరిగణించడానికి కారణం అక్కడున్న కమ్మ వారి ఆస్తులకి పెరుగుదల లేకుండా చెయ్యాలని ప్రభుత్వ లక్ష్యం అని కొందరు బలంగా నమ్ముతున్న అంశం. ఏ…

అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కాకుండా కేవలం పాక్షిక రాజధానిగానే పరిగణించడానికి కారణం అక్కడున్న కమ్మ వారి ఆస్తులకి పెరుగుదల లేకుండా చెయ్యాలని ప్రభుత్వ లక్ష్యం అని కొందరు బలంగా నమ్ముతున్న అంశం. ఏ లెక్కన నిజాలు చెప్పినా తాబట్టిన కుందేటికి మూడే కళ్లు అన్నట్టుగా ఇది కమ్మవారిపై దాడిగానే పచ్చకూతలు కూసేవాళ్లు చాలామందే ఉన్నారు. 

ఇప్పుడు కొత్తగా అమారరాజా కంపెనీని కూడా అదే లెక్కలో వేస్తున్నారు ఒక వర్గపు మీడియా వారు. ఇది కమ్మ వారి కంపెనీకాబట్టి రాష్ట్రంలోంచి వెళ్లగొట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం పొగ బెట్టిందని వారి గుడ్డి నమ్మకం. 

నిజానికి అమరరాజా నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని నియమాలు సూచించింది. వాటిని పాటించకుండా కంపెనీ తన కార్యకలాపాలు అలాగే చేసుకుంటోంది. కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హై కోర్టు కలిసి తీసుకున్న నిర్ణయం వల్లే అమరరాజా పక్క రాష్ట్రంలోకి పోతానంటోంది. అసలిక్కడ ప్రభుత్వ ప్రమేయమే లేదని, నియమాలకు కట్టుబడి వ్యాపారం చేసుకోకపోతే ఇక్కడనుంచి పోవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 

అయినా సరే కందకి లేని దురద కత్తిపీటకన్నట్టుగా కొందరు ప్రబుద్ధులు దీనికి కమ్మ రంగు పూస్తున్నారు. నిజంగా తనవైపు నుంచి ఏ తప్పూ లేకపోతే ఆ కంపెనీ అధినేత, పార్లెమెంటు మెంబరు గల్లా జయదేవ్ ప్రభుత్వం గళ్లా పట్టుకుని అడగొచ్చుగా…! పార్లమెంటులో ప్రస్తుతం సెషన్స్ జరుగుతున్నాయి కనుక వాగ్ధాటి గల జయదేవుడు ప్రభుత్వాన్ని నగ్నంగా నిలబెట్టొచ్చుగా..! అవేమీ చేయకుండా నోటికి తాళం వేసుకుని బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడంటే అర్థమేంటి? ముమ్మాటికీ అతనికి జరిగిన తప్పులు తెలుసు. అందుకే ఆ మౌనం. అసలు వ్యక్తి అలా ఉన్నా కొసరుగాళ్లకి మాత్రం నోరు లేస్తోంది, చేతులు రాస్తున్నాయి. 

గతంలో భారతి సిమెంట్ కంపెనీని మూయించాలని చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. ప్రభుత్వ పరంగా ఎన్నో నియమాలని తెర మీదకి తెచ్చారు. ఆ కంపెనీ ఆ నియమాలు అన్నిటినీ పాటించి కంపెనీని నిలబెట్టుకుంది. ఆ పని ఇప్పుడు అమారారాజావారు చేయడానికి కష్టమేంటి? దీనిని కమ్మకావరమా అంటే సమధానం ఏం చెప్తారు? 

మరొక విషయమేమిటంటే ప్రస్తుతం దాదాపు 60 కంపెనీలకి ఇటువంటి నోటీసులే ఇచ్చారు. ఆ 60 కంపెనీలూ అనేక కులాలవారికి చెందినవి. అలాంటప్పుడు ఒక వర్గపు మీడియా ఒక్క అమరరాజానే ఎందుకు హైలైట్ చేస్తోందో ఆలోచిస్తే అసలు విషయం ఇట్టే బోధపడుతుంది. 

నిజానిజాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ప్రతి దానికి కమ్మ రంగు పూసి ప్రభుత్వం మీద విరుచుకుపడే సోషల్ మీడియా గాళ్లున్నంతవరకు ఆ కులానికి, ఆ కులానికి కేరాఫ్ అడ్రస్ గా ఖ్యాతి పొందిన పార్టీకి కూడా జనాదరణ కరువవుతుందని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో! 

ప్రదీప్ కాటసాని