ఒక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని కేంద్రం గట్టిగానే చెబుతోంది. ఆ విషయంలో రెండవ మాటకు అసలు తావు లేదని కూడా అంటోంది. ఉక్కు కార్మిక లోకం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఈ బలి ఆగేట్టుగా లేదనే అంటున్నారు.
ఇదిలా ఉంటే అదే ఉత్తరాంధ్రాలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందంటూ జరుగుతున్న ప్రచారం సరికొత్త ఆశలను, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం కొట్టక్కిలో సుమారుగా రెండు వందల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇందుకోసం వేయి కోట్ల పెట్టుబడితో జిందాల్ గ్రూప్ రెడీ అవుతున్నాట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ ప్లాంట్ కి అవసరమైన భూమి కోసం సర్వే కూడా జరుగుతోంది. ఈ భూమిని ఏపీఐఐసీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇక్కడ గతంలో ఏపీఐఐసీ మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ వారికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుంది. దాంతో జిందాల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి ఇవ్వడానికి భూమి ఉందని అంటున్నారు. మొత్తానికి అన్నీ అనుకూలిస్తే విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయ్యే అవకాశం అయితే ఉందని అంటున్నారు.
అంటే దేశంలోనే ప్రఖ్యాతి చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక వైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మినీ స్టీల్ ప్లాంట్ పక్క ఊళ్ళో ఏర్పాటు కావడం అంటే కొంతలో కొంత ఉపశమనమే అనుకోవాలేమో.