మృత్యుబావి హత్య కేసును ఛేదించిన పోలీసులు

వరంగల్ జిల్లా గీసుకొండలో సంచలనం సృష్టించిన మూకుమ్మడి హత్యల కేసును పోలీసులు రోజుల వ్యవథిలో ఛేదించారు. బీహార్ కు చెందిన 24 ఏళ్ల సంజయ్ కుమార్ యాదవ్ అనే దుర్మార్గుడు ఈ హత్యలన్నీ చేసినట్టు…

వరంగల్ జిల్లా గీసుకొండలో సంచలనం సృష్టించిన మూకుమ్మడి హత్యల కేసును పోలీసులు రోజుల వ్యవథిలో ఛేదించారు. బీహార్ కు చెందిన 24 ఏళ్ల సంజయ్ కుమార్ యాదవ్ అనే దుర్మార్గుడు ఈ హత్యలన్నీ చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నమ్మశక్యం కాని నిజాల్ని బయటపెట్టారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా 9 హత్యలు చేశాడు ఈ నీచుడు.

జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో గోనె సంచులు తయారు చేసే ఫ్యాక్టరీలో మక్సూద్ కుటుంబం పనిచేస్తూ ఉండేది. ఈక్రమంలో బీహార్ కు చెందిన సంజయ్ వీళ్లకు పరిచయమయ్యాడు. మక్సూద్ భార్య అక్క కూతురు రఫీకా (31 ఏళ్లు)తో సంజయ్ కు పరిచయమైంది. అయితే రఫీకాకు అప్పటికే పెళ్లయి పిల్లలున్నారు. భర్త నుంచి విడిపోయింది.

దీన్ని ఆసరాగా చేసుకొని రఫీకాకు దగ్గరయ్యాడు. ఏకంగా ఓ ఇల్లు తీసుకొని అందులో రఫీకాతో సహజీవనం కూడా మొదలుపెట్టాడు. అంతా బాగుందనుకునే టైమ్ లో రఫీకాకు చేదు నిజం తెలిసింది. తనతో పాటు తన కూతురుతో కూడా సంజయ్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడని గ్రహించింది. దీనిపై పలుమార్లు సంజయ్ ను హెచ్చరించింది. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని కూడా చెప్పింది.

ఈ క్రమంలో రఫీకాను అడ్డుతొలిగించుకోవాలని భావించాడు సంజయ్. పెళ్లి విషయమై ఇంట్లో మాట్లాడదామని చెప్పి ఆమెను విశాఖ వెళ్లే గరీబ్ రధ్ ఎక్కించాడు. దారి మధ్యలో ఆమెకు మత్తుమందు కలిపిన మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే రైలు నుంచి తోసేసి హత్య చేశాడు.

రఫీకా లేకుండా ఒంటిరిగా వచ్చిన సంజయ్ ను చూసి మక్సూద్ భార్య నిలదీసింది. ఏం జరిగిందో చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో చేసిన ఒక్క హత్యను కప్పిపుచ్చుకునేందుకు మొత్తం కుటుంబాన్ని లేపేయాలని నిర్ణయించుకున్నాడు సంజయ్. మక్సూద్ కొడుకు పుట్టినరోజు నాడు ఇంటికి వెళ్లిన సంజయ్.. వాళ్లు వండుకున్న అన్నంలో మత్తుమందు కలిపాడు. తను వచ్చిన విషయం బయటకు చెబుతారేమో అనే భయంతో పుట్టినరోజు వేడుకకు వచ్చిన శ్యామ్, శ్రీరామ్ అనే ఇద్దరు బయట వ్యక్తులకు కూడా మత్తు మందు ఇచ్చాడు.

అంతా నిద్రలోకి జారుకున్న తర్వాత అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఒక్కొక్కరిని గోడౌన్ పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయాడు. ఆ బావి నుంచి ఒక రోజు 4 మృతదేహాలు, మరుసటి ఒకేసారి 5 మృతదేహాలు బయటపడ్డంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 6 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ ను అరెస్ట్ చేసి, తమదైన శైలిలో విచారిస్తే.. మొత్తం బయటపెట్టాడు దుర్మార్గుడు. 

‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు