శరీరం పై పడుతున్న వృద్ధాప్య ఛాయలను తగ్గించాలంటే.. అందుకు ముఖ్యమైన పరిష్కార మార్గాల్లో వాకింగ్ ఒకటి అని అంటున్నాయి వివిధ పరిశోధనలు. ప్రతి రోజూ కాసేపైనా వాకింగ్ చేయాలనేది వైద్యులు, పెద్ద వాళ్లు అంతా ఇచ్చే సలహానే! ప్రపంచంలో చాలా మంది పాటించే సలహా కూడా ఇదే. ఆధునిక జీవన శైలిలో వాకింగ్ ను చాలా మంది భాగంగా చేసుకుంటూ ఉన్నారు. మరి కొందరు వాకింగ్ మొదలు పెట్టడానికి ముహూర్తాలను చూసుకుంటూనే ఉంటారు.
మరి వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో అని పరిశోధనలు చెబుతూ ఉంటాయి. వాటిల్లో ఒకటి.. వాకింగ్ అనేది యాంటీ ఏజింగ్ మెడిసిన్ అని అంటోంది అలాంటి పరిశోధన ఒకటి. ప్రతి రోజూ వాకింగ్ కు కొద్ది సమయాన్ని కేటాయించడం వల్ల.. మీరు మరింత యంగ్ అవుతారనేది ఈ థియరీ. అనేక మందిపై ఇది ప్రాక్టికల్ గా నిరూపణ అయ్యిందట. ఇరవై యేళ్లుగా తాము క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నామని చెబుతున్న వారు, తమ వయసు వారి కన్నా.. యంగ్ గా అగుపిస్తున్నారట. వారి జీవన శైలిలో వాకింగ్ ను తప్పనిసరిగా చేసుకోవడం వల్ల వారు పొందే ప్రయోజనం ఇదనేది ఈ పరిశోధన చెబుతున్న విషయం.
ఇక వాకింగ్ చేయడం వల్ల బాడీ ఫిట్ నెస్ మెరుగు పడుతుంది. కండరాలు పటిష్టమవుతాయి. అలాగని తారు రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద లాంగ్ వాక్ లు తగనేది మరో సలహా. వాటి వల్ల మోకాళ్ల చిప్పలు అరిగిపోయే అవకాశాలుంటాయంటారు. మట్టి రోడ్డు మీద, గడ్డి ర్యాంపుల మీద వాకింగ్ మంచిదంటారు.
అలాగే వాకింగ్ ను అలవాటుగా కలిగిన వారు నడిచేటప్పుడు తమ చేతిలో చిన్న పాటి బరువు పెట్టుకుని నడవడం మంచిదట. చిన్న సైజు డంబెల్స్ ను చేత పట్టుకుని వాక్ చేయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయట.
ఏ రోజుకారోజు కొన్ని అదనపు అడుగులు వేయవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిన్న నడిచిన దూరం కన్నా.. ఈ రోజు మరి కొంత అదనంగా నడవాలని, తద్వారా వీలైనంత ఎక్కువ దూరం నడవడాన్ని అలవాటు చేసుకోవచ్చని, దీని వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని వైద్య పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే నడిచే వేగంలో కూడా హెచ్చు తగ్గులు పెట్టుకోవాలని, బ్రిస్క్ వాక్ తో ప్రయోజనాలు ఎక్కువంటారు.