మిడ్ రేంజ్ సినిమాల హీరోలు నాని..నితిన్..వరుణ్ తేజ్..సాయి ధరమ్ తేజ్..శర్వానంద్..వీళ్లెవ్వరి సినిమాలు మరో ఆరు నెలల వరకు థియేటర్లలోకి రావు. చైతన్య సినిమా థియేటర్ లోకి రావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. అఖిల్ ఏజెంట్ పరిస్థితి ఇంకా క్లారిటీ లేదు.
యంగ్ హీరోలు నిఖిల్..నాగశౌర్య..నవీన్ పోలిశెట్టి..వైష్ణవ్ తేజ్, బెల్లంకొండ.. ఎక్స్ ట్రాల సినిమాలు కూడా ఇప్పట్లో లేవు.
టాప్ హీరోలు ఎన్టీఆర్..చరణ్..బన్నీ..ఈ ముగ్గురి సినిమాలు మరో ఏడాది వరకు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు తక్కువే.
సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలు మాత్రమే మరో మూడు నెలల నుంచి ఆరు నెలల్లో థియేటర్లలోకి వస్తాయి.
టాప్ హీరోల్లో ఒక్క మహేష్ బాబు సినిమా మాత్రమే వచ్చే సమ్మర్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం వుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రావాలంటే కనీసం మూడు నెలలు ఆగాల్సి వుంది.
ఇదీ టాలీవుడ్ ప్లానింగ్. దీనికి చాలా కారణాలు వున్నాయి.
కరోనా అన్నది ఫస్ట్ రీజన్. జనాలు ఏ సినిమా యాక్సెప్ట్ చేస్తారో? ఏది చేయరో అన్నది క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరికీ విజయం ఎలా అనే భయం పట్టుకుంది. మరో పక్క పాన్ ఇండియా అన్నది ఒక అవసరంగా మార్చుకుంటున్నారు. దాని కోసం పాన్ ఇండియా స్టార్ కాస్ట్ కోసం చూస్తున్నారు. అది అంత సులువుగా పాజిబుల్ కావడం లేదు. సరైన హీరోయిన్లు దొరకడం లేదు.
మొత్తం మీద సినిమాల ప్లానింగ్ అన్నది ప్రీ ప్రొడక్షన్ లేదా అగ్రిమెంట్ దశలోనే ఎక్కువకాలం వుంటున్నాయి. దీని వల్ల ప్రాపర్ ప్లాన్డ్ గా ప్రతి నెల రెండు సరైన సినిమాలు వచ్చే అవకాశం చేజారిపోతోంది. ఏడాదికి మూడు సినిమాలు చేయగలిగిన మిడ్ రేంజ్, చిన్న హీరోల చేతిలో కూడా ఒకటి, రెండు సినిమాలు మించి లేవు.
నిఖిల్ రెండు సినిమాల కథలకు గీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని ఒక్క కథకు ఓకె చెప్పారు. వరుణ్, వైష్ణవ్ కూడా అంతే. సాయి ధరమ్ మూడు సినిమాల ఓకె చేసి వుంచారు. బెల్లంకొండ చేతిలో ఒకే ఒక్క సినిమా వుంది. ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే.
వీళ్ల కన్నా సీనియర్ హీరోలే బెటర్. బాలయ్య చేతిలో రెండు, రవితేజ మూడు, చిరంజీవి రెండు, పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి.
అసలే థియేటర్ల పరిస్థితి బాగా లేదు. ఇలా నెలకు ఒకటీ అరా సినిమాలు వస్తుంటే మిగిలిన వారాలు థియేటర్లు పడుకుంటున్నాయి. జనాలు కూడా చిన్న, మిడ్ రేంజ్ సినిమాల వైపు అంతగా తొంగి చూడడం లేదు. కంటెంట్ బాగుంటే చూస్తారు అన్న మాట వాస్తవమే అయినా, అలాంటి సినిమాలు అమావాస్యకు, పున్నానికీ ఒకటి రావడం గగనంగా వుంది. ఒకే ఒక జీవితం లాంటి కంటెంట్ బాగున్న సినిమాలు వచ్చినా రెవెన్యూ పెద్దగా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ పెద్దలు ఆలోచించాల్సింది సినిమాలు స్ట్రీమ్ లైన్ చేసి, చకచకా ప్లానింగ్ చేసి విడుదల చేయడం లేదూ అంటే జనాలు థియేటర్ కు దూరం అయ్యే ప్రమాదం వుంది.