కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్ష ఎన్నిక అంశం పై తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక జరగడానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారనేది స్పష్టత లేని అంశమే. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాను చేపట్టి… ఆ పార్టీ భాగ్య రేఖను మార్చాలనే తపన కొందరిలో అయితే ఉన్నట్టుంది.
వారిలో ఒకరు కేరళకు చెందిన కాంగ్రెస్ నేత, త్రివేండ్రం ఎంపీ శశిథరూర్. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టుగా సోనియాగాంధీకి నివేదించుకున్నారట థరూర్. తనతో పాటు మరి కొందరు నేతలను తీసుకెళ్లి సోనియాగాంధీ ఆశీస్సులను కోరారట థరూర్.
మరి కాంగ్రెస్ పార్టీ చరిత్రను బట్టి చూస్తే.. ఆ పార్టీ సభ్యత్వం ఉన్న వారు ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగవచ్చు! ఇదే విషయం చెప్పిందట సోనియాగాంధీ. ఆసక్తి ఉన్న వారెవరైనా పార్టీ అధ్యక్ష బరిలో నిలవొచ్చంటూ థరూర్ కు చెప్పిందట సోనియా! ఎంత గొప్ప ప్రజాస్వామ్యమో!
మహామహులు పోటీ పడిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇలా సోనియా ఆశీస్సులు తీసుకుని పోటీ చేస్తామంటూ పర్మిషన్ తీసుకునే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా ఉంది. తను చక్రం తిప్పిన రోజుల్లో సోనియా మరొకరి పోటీ లేకుండా అలాంటి ఊసే లేకుండా అధ్యక్షురాలిగా చలామణి అయ్యింది. తనయుడిని కూడా అలాగే ఎన్నిక చేసింది. అతడేమో విరక్తి ప్రదర్శించారు. ఇప్పుడు ఆయన మనసేమిటో అర్థం చేసుకోవడం కాంగ్రెస్ వాళ్లకే సాధ్యం కావడం లేదు
మరి మొత్తానికి ధైర్యం చేసి తను పోటీలో ఉండాలనుకుంటున్నట్టుగా థరూర్ సోనియాకే చెప్పేశాడట. ఎవరైనా పోటీ చేసుకోవచ్చు అంటూ సోనియా ఔదార్యాన్ని ప్రదర్శించారట. మరి ఈ మేరకు సోనియా సమ్మతితో థరూర్ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారో లేక సోనియా, రాహుల్ ల లెక్కలు వేరే ఉన్నాయో!