Advertisement

Advertisement


Home > Politics - National

చీపురు పార్టీ రాజ‌కీయం..కక్క‌లేని, మింగ‌లేని బీజేపీ!

చీపురు పార్టీ రాజ‌కీయం..కక్క‌లేని, మింగ‌లేని బీజేపీ!

ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ.. కాంగ్రెస్ పార్టీ రికార్డుల‌ను స‌వ‌రిస్తోంది. త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వాల‌ను కూల్చింద‌ని కేంద్రంలోని కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి పేరు! అయితే బీజేపీ చేష్ట‌లు మ‌రింత తీవ్రంగా ఉన్నాయి. త‌మ‌కు ఎమ్మెల్యేలు, ఓట్లు లేని చోట కూడా బీజేపీ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసేస్తోంది. ఎక్క‌డైనా కాంగ్రెస్ కు కానీ, దాని కూట‌మికి గానీ బోటాబోటీ మెజారిటీ ఉందంటే అంతే సంగ‌తి! క‌మ‌లం పార్టీ అక్క‌డ ప్ర‌భుత్వాన్ని కూల్చి త‌ను పాగా వేస్తోంది!

ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్యేల‌ను కొన‌కుండా ప‌ని జ‌ర‌గ‌ద‌నేది సామాన్యులు చెప్పే మాట‌. క‌మ‌లం పార్టీ తిరుగుబాటుదార్ల‌ను, ఎమ్మెల్యేల చేరిక‌ల‌ను అడ్డుపెట్టుకుని ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తోందంటే.. దాని వెనుక చాలా క‌థే ఉంటుంద‌నేది కాద‌న‌లేని అంశం. దీనిపై కాంగ్రెస్ క‌న్నా.. ఆప్ గ‌ట్టిగా స్పందిస్తోంది. క‌మ‌లం పార్టీ ఎమ్మెల్యేల‌కు రేటు క‌డుతోంద‌ని.. ఒక్కో ఎమ్మెల్యేకు 25 నుంచి ముప్పై కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చి త‌న వైపుకు తిప్పుకుంటోంద‌ని బీజేపీపై ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనునిత్యం ఆరోపిస్తున్నారు.

అంతే కాదు.. ఢిల్లీ, పంజాబ్ ల‌లోని ఆప్ ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు. రాజ‌కీయంగా అంత గిట్టుబాటు ఉండ‌ని ఢిల్లీలోనే బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు పాతిక కోట్ల‌రూపాయ‌లను ఆఫ‌ర్ చేస్తోంద‌నే ఆరోప‌ణ వ‌స్తోంది ఆప్ నుంచి. దీనికి విరుగుడుగా తాము విశ్వాస పరీక్ష‌ను ఎదుర్కొంటామంటూ వ‌ర‌స‌గా ఆ పార్టీ ఆ వ్యూహాన్నిఫాలో అవుతోంది.

ఇప్ప‌టికే ఢిల్లీలో కేజ్రీవాల్ స‌ర్కారు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొని గెలిచి నిలిచింది. ఇప్పుడు పంజాబ్ లోని ఆప్ స‌ర్కారు కూడా విశ్వాస ప‌రీక్ష‌కు ప్ర‌క‌ట‌న చేసింది. ఈ గురువారం పంజాబ్ అసెంబ్లీలో భ‌గ‌వంత్ సింగ్ మాన్ స‌ర్కారు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది. త‌మ వారెవ‌రో కాని వారెవ‌రో తేల్చుకుంటామంటూ ఆప్ ప్ర‌క‌టించింది.

ప‌టిష్ట‌మైన మెజారిటీ ఉండ‌టంతో.. ఆప్ ఇలా వ‌ర‌స‌గా విశ్వాస ప‌రీక్ష‌ల‌కు సై అన‌గ‌లుగుతుంది. త‌ద్వారా బీజేపీ ఏవైనా ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నా, వాటిని ఇలా ఆదిలోనే గ్ర‌హించే ప్ర‌య‌త్నం చేస్తోంది ఆప్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీల్లో ప‌టిష్ట‌మైన మెజారిటీనే ఉన్నా... బీజేపీని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేద‌న్న లెక్క‌ల ప్ర‌కారం.. ఆప్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో త‌మ పార్టీని ప్ర‌భుత్వాల‌ను కూల్చే పార్టీగా ఆప్ నిల‌బెడుతూ ఉండ‌టం బీజేపీకి ఇబ్బందిక‌ర‌మైన అంశంగా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?