తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియాజకవర్గాలను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవాలని అధికార గులాబీ పార్టీ ఆశలు పెట్టుకుంది. 2018 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు టీఆర్ఎస్ నాయకులు కొన్ని లెక్కలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ అనుకూల విధానాలు అనుసరిస్తూ, వారి ఆకాంక్షలను నెరవేరుస్తున్నందున వచ్చే ఎన్నికల్లో ఆ నియాజకవర్గాలు తమ పార్టీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 31 రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. వాటిల్లో ఎస్సీ నియోజకవర్గాలు 19 కాగా 12 ఎస్టీ నియోజకవర్గాలు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ 16 ఎస్సీ సీట్లను, ఆరు ఎస్టీ సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎస్సీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ములుగు, మధిర ఎస్సీ నియోజకవర్గాలు, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ ఖాతాలో పడలేదు. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో పదిహేను వందల కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాదులో ఆదివాసీ, బంజారా భవన్ లను ప్రారంభించారు. ఇక కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెడతామన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేస్తామన్నారు. గిరిజన బంధు కూడా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రిజర్వుడు స్థానాలు పూర్తిగా గెలుచుకోవడానికి ఇవన్నీ తమకు దోహదం చేస్తాయని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ హామీలను ఎన్నికల గిమ్మిక్కులుగా కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. మరి ఎస్సీలు, ఎస్టీలు ఈ హామీలకు ఆకర్షితులవుతారా అనేది ఎన్నికల ఫలితాలు చెప్పాలి.