జనసేనాని పవన్‌కల్యాణ్‌ను మంత్రి ఆర్కే రోజా రాజకీయంగా ఉతికి ఆరేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదివారం పవన్‌కల్యాణ్ విమర్శించిన నేపథ్యంలో రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్‌పై పవన్‌కల్యాణ్ ఒక్కో విమర్శకు సమాధానం చెబుతూ, రోజా చాకిరేవు పెట్టారు. 45 సీట్లే వైసీపీకి వస్తే 135 సీట్లు మీకు వస్తాయా? అని పవన్‌ను రోజా నిలదీశారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు జాతకం చెబుతుంటే నవ్వొస్తోందని వెటకరించారు. గతంలో ఇలాంటి సర్వేలను నమ్ముకుని జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాడు, కాలేడు…ఇదే నా శాసనం అన్నావని ఆమె గుర్తు చేశారు.
ఇదే నా శాసనం అన్నావని, అలాంటి నాయకుడిని శాసనసభలోకి రానివ్వకుండా చేసిన సంగతిని మరిచిపోయావా? అని రోజా ప్రశ్నించారు. కనీసం 175 నియోజకవర్గాల్లో జనసేనకు పోటీ చేసే అభ్యర్థులే లేరని, అలాంటి పార్టీ అధ్యక్షుడు పవన్ అసెంబ్లీపై పార్టీ జెండా ఎగురవేస్తారట అని వ్యంగ్యంగా అన్నారు. కౌన్సిలర్‌గా, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా గెలవాలని, ఆ తర్వాత ఎమ్మెల్యే విషయాన్ని ఆలోచిద్దామని రోజా సలహా ఇచ్చారు. గ్రామస్థాయిలో సినిమా పిచ్చితో సభలకు వచ్చారని, సీఎం అవుతానని కలలు కని ఎలా బొక్క బోర్లా పడ్డావో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
సినీ పరిశ్రమలోని హీరోలంతా నిన్ను హీరో అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఎన్టీఆర్ పార్టీ పెట్టి, దమ్మున్న మగాడిలా ఒంటరిగా పోటీ చేశారన్నారు. చిరంజీవి కూడా సింగిల్‌గా పోటీ చేశారని చెప్పుకొచ్చారు. కానీ అదే రక్తం పంచుకు పుట్టిన నువ్వు 2014లో ఎన్నికలకు వెళ్లావా? అని నిలదీశారు. ప్యాకేజీలు తీసుకుని బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశావన్నారు. ఇవాళ రాష్ట్రం కుక్కలు చించేసిన విస్తరి కావడానికి నువ్వు, నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలు కారణం కాదా? అని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకోని నువ్వు, ఇప్పుడు నోరు చించుకుంటున్నావంటే ప్యాకేజీ కోసమా? అని రోజా నిలదీశారు. గతంలో విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా వుంటే, ప్రశ్నించకుండా షూటింగ్‌ల్లో వున్నావా? లేదంటే సూట్‌కేసులు తీసుకుంటున్నావా? అని విరుచుకుపడ్డారు. వీకెండ్‌లో పీకే వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌కు రోజా సవాల్ విసిరారు. నీ జెండా, అజెండా మీద నమ్మకం వుంటే , 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపగలననే నమ్మకం వుంటే , నీకు దమ్ము, ధైర్యం వుంటే జగన్‌తో సింగిల్‌గా పోటీ చేయ్ అని సవాల్ విసిరారు. ఊరికే ప్యాకేజీల కోసం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను నిలదీశారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు .పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అని తేల్చి చెప్పారు.