లిక్క‌ర్ స్కామ్‌తో సంబంధం లేద‌న్న వైసీపీ ఎంపీ

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌తో త‌మ కుటుంబానికి ఎలా సంబంధం లేద‌ని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి తేల్చి చెప్పారు. ఈయ‌న ఒంగోలు లోక్‌స‌భ స్థానం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఢిల్లీ…

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌తో త‌మ కుటుంబానికి ఎలా సంబంధం లేద‌ని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి తేల్చి చెప్పారు. ఈయ‌న ఒంగోలు లోక్‌స‌భ స్థానం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ప‌లువురు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల పేర్లు వినిపించాయి. ప్ర‌ధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత పేరును బీజేపీ తెర‌పైకి తెచ్చింది. త‌న ప‌రువుకు భంగం క‌లిగిస్తున్నారంటూ బీజేపీ నేత‌ల‌పై క‌విత న్యాయ‌పోరాటానికి దిగిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీ, చెన్నైల‌లో ఇటీవ‌ల మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి, ఆయ‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి చెందిన నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. కీల‌క డాక్యుమెంట్లు ల‌భ్య‌మైన‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. త‌న కుటుంబంపై సాగుతున్న దుష్ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఒంగోలు ఎంపీ మీడియా ముందుకొచ్చారు.

త‌న శ్రేయోభిలాషుల‌తో పాటు స‌మాజానికి వాస్త‌వాలు చెప్ప‌డానికే మీడియా స‌మావేశం నిర్వ‌హించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. త‌మ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించిన మాట వాస్త‌వ‌మే అని అంగీక‌రించారు. అయితే ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఎలాంటి ఆధారాలు త‌మ ఇంట్లో ల‌భ్యం కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. 

ఉత్త‌రాది రాష్ట్రాల్లో త‌మ‌కు మ‌ద్యం వ్యాపారాలు లేవ‌ని తేల్చి చెప్పారు. ద‌క్షిణాదిలో మాత్రం వ్యాపారాలు ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. మాగుంట కుటుంబం అంటే తాను, త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.