ఏపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్టర్ సునీత షాక్ ఇచ్చారు. అన్న పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా సునీత తేల్చి చెప్పారు. తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుకున్నది ఆమె సాధించారు. సీబీఐ దర్యాప్తు సంవత్సరాల తరబడి సాగుతూ…వుంది.
ఇందులో భాగంగా దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులో పెట్టడం వివేకా హత్య కేసులో అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు. దీంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించి తమను అరెస్ట్ చేయకుండా ఉపశమనం పొందాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత మరో అడుగు ముందుకేశారు.
అసలు ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని, దర్యాప్తు సంస్థ అధికారులు సాక్షులను బెదిరిస్తున్నారని, కావున మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. వేరే రాష్ట్రానికి మార్చిన తర్వాతే సీబీఐ తదుపరి విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో సునీత కోరడం గమనార్హం.
సునీత పేర్కొన్న అంశాలపై సమాధానం చెప్పాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు ధర్మాసనం వాయిదా వేసింది. అన్న పాలనపైనే నమ్మకం లేదని డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.