అమెరికాలో ఒంట‌రి త‌ల్లి క‌ష్టాలు

అమెరికా సంప‌న్న దేశం. సుఖాలు, సౌక‌ర్యాలు త‌ప్ప క‌ష్టాలే వుండ‌వ‌నే భావ‌న మ‌న‌లో వుంది. కానీ కోట్లాది పేద‌లున్నారు. ఇల్లు లేని వారు, తిండిలేని వాళ్లు ప్ర‌తి వూళ్లో వున్నారు. అలాంటి పేద సింగిల్…

అమెరికా సంప‌న్న దేశం. సుఖాలు, సౌక‌ర్యాలు త‌ప్ప క‌ష్టాలే వుండ‌వ‌నే భావ‌న మ‌న‌లో వుంది. కానీ కోట్లాది పేద‌లున్నారు. ఇల్లు లేని వారు, తిండిలేని వాళ్లు ప్ర‌తి వూళ్లో వున్నారు. అలాంటి పేద సింగిల్ మామ్ (ఒంట‌రి త‌ల్లి) క‌థే “మెయిడ్” వెబ్ సిరీస్‌. నెట్‌ప్లిక్స్‌లో 10 ఎపిసోడ్స్ వున్నాయి.

మ‌నుషులు మారాలి సినిమాలో శార‌ద‌ని చూసి కంట‌త‌డి పెట్ట‌ని వాళ్లు లేరు. మాతృదేవోభ‌వఃలో మాధ‌వి కూడా అంతే ఏడ్పించింది. ఒక త‌ల్లి పిల్ల‌ల కోసం ప‌డే త‌పన క‌దిలిస్తుంది. మెయిడ్‌లో కూడా అలెక్స్ (హీరోయిన్‌) జీవ‌న ప్ర‌యాణంలో మ‌నం కూడా క‌ళ్లు తుడుచుకుంటూ వుంటాం.

సుఖ‌ప‌డేవాళ్ల జీవితాల‌న్నీ ఒక‌టే, కానీ క‌ష్టాలు మాత్రం ఎవ‌రి క‌ష్టాలు వాళ్లవే అంటాడు టాల్‌స్టాయ్‌. పేద‌వాళ్ల కష్టాలు ఏ దేశంలోనైనా ఒక‌టే. అమెరికాలో కూడా ఏడిస్తే క‌న్నీళ్లే వ‌స్తాయి.

గృహం వుంటే గృహ హింస కూడా వుంటుంది. అమెరికా చాలా సివిలైజ్‌డ్ సొసైటీ, ఆడ‌వాళ్ల‌కి చాలా హ‌క్కులుంటాయి అంటారు. అక్క‌డా ఆడ‌వాళ్ల క‌ష్టాల‌కి అంతులేదు, గృహ హింస‌కి కొద‌వ‌లేదు. కాక‌పోతే మ‌న‌లా కాకుండా చ‌ట్టం ఎంతోకొంత ప‌ని చేస్తుంది. ఇంటి నుంచి బ‌య‌టికొచ్చిన మ‌హిళ‌ల‌కి ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

స్టిఫానిలాండ్ అమెరికాలో పేరున్న ర‌చ‌యిత్రి. ఆమె జీవిత‌మే ఈ సీరిస్‌. 16 ఏళ్ల వ‌య‌సులో జ‌రిగిన కారు ప్ర‌మాదంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లింది. 30 ఏళ్ల వ‌య‌సులో గృహ హింస భ‌రించ‌లేక 9 నెల‌ల కూతురితో బ‌య‌టికొచ్చింది. డ‌బ్బులు లేవు. పెద్ద‌గా చ‌దువు లేదు. హోమ్‌లెస్ షెల్ట‌ర్స్‌లో వుంటూ, ఇళ్ల‌లో ప‌ని చేస్తూ కూతురిని సాకింది. ఆరేళ్లు టాయిలెట్స్ క్లీన్ చేస్తూ, గార్బెజ్ సంచులు మోస్తూ జీవించింది. 2014లో స్టూడెంట్ లోన్‌పై క్రియేటివ్ రైటింగ్‌లో డిగ్రీ చేసింది. త‌న క‌ష్టాల్ని ఒక పుస్త‌కం రాసింది. Maid…Hard work, Low pay and a mothers will to survive ఈ పుస్త‌కం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్‌గా నిలిచింది. దీన్నే Netflix తీసింది.

2021లో వ‌చ్చిన ఈ సీరిస్ సూప‌ర్‌హిట్‌. టాప్ షోలో ఇదొక‌టి. 6.70 కోట్ల మంది చూశారు. మార్గ‌రెట్ క్యాలి హీరోయిన్‌గా న‌డిచింది. ఆండీ మాక్డోవెల్ అనే న‌టి కూతురు ఈ అమ్మాయి. త‌ల్లీకూతుళ్లు అద్భుతం. ఈ సీరిస్‌లో వాళ్లు త‌ల్లీకూతుళ్ల‌గానే న‌టించారు. త‌ల్లి ఆండీ జీవితంలో కూడా భ‌ర్త‌తో విడిపోయే సంఘ‌ట‌న‌లు వున్నాయి. వీళ్లిద్ద‌రూ ఒక‌ర్ని మించి మ‌రొక‌రు న‌టించారు.

ఈ సీరిస్ ఎందుకు చూడాలంటే, దీంట్లో థ్రిల్స్ లేవు, ట్విస్టులు లేవు. కానీ ఉన్న‌దంతా జీవిత‌మే. మూడు సంవ‌త్స‌రాల బిడ్డ‌తో, చేతిలో పైసా లేక, ఇల్లు లేక ఒక ఫెర్రీ స్టేష‌న్‌లో ఒంట‌రిగా కూచున్న అలెక్స్ ఎన్నో క‌ష్టాల్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొందో, ఎంత ప్రేర‌ణ‌గా నిలిచిందో తెలుసుకోడానికి చూడాలి. భ‌రించ‌లేని స్థితి వ‌స్తే త‌ప్ప క‌న్నీళ్లు పెట్టుకోదు. క‌ష్టాల‌ని చెప్పుకుని సానుభూతి కోర‌దు. జీవితం ఒక యుద్ధ‌మ‌నుకుంటే అలెక్స్ ఒక సేనాప‌తి. ఒంట‌రి సేనాప‌తి. నిజానికి ప్ర‌తి సింగిల్ మామ్ ఒక యోధురాలే.

ఇది చూసిన త‌ర్వాత మ‌న‌కి క‌నిపించే ప‌నివాళ్ల వెనుక ఒక విషాదం వుంటుంద‌ని, ఇంటి ద‌గ్గ‌ర చిన్న బిడ్డ‌లుంటార‌ని, ఆమె తెచ్చే కాసిన్ని డ‌బ్బుల‌తో వాళ్లు బ‌త‌కాల‌ని అర్థ‌మైతే స్టిఫానిలాండ్ జీవితం మ‌న‌కి అర్థ‌మైన‌ట్టే.

జీఆర్ మ‌హ‌ర్షి