చంద్రబాబును ఆకట్టుకున్న పాలకొల్లు ఫార్ములా

ఏపీలోని వంద నియోజకవర్గాల్లో పాలకొల్లు ఫార్ములా అమలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఫార్ములా పార్టీకి గెలుపు బాటలు వేస్తుందని నమ్ముతోంది. ఇంతకూ ఏమిటీ పాలకొల్లు ఫార్ములా? పేరు చాలా కొత్తగా ఉంది. పాలకొల్లు…

ఏపీలోని వంద నియోజకవర్గాల్లో పాలకొల్లు ఫార్ములా అమలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఫార్ములా పార్టీకి గెలుపు బాటలు వేస్తుందని నమ్ముతోంది. ఇంతకూ ఏమిటీ పాలకొల్లు ఫార్ములా? పేరు చాలా కొత్తగా ఉంది. పాలకొల్లు నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆకర్షించింది. 

అక్కడి పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనిచేస్తున్న తీరు ఆయన్ని ఆకట్టుకుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎమ్మెల్యేల్లో (ఎంపీల్లో కూడా) బాగా పనిచేసేవారు ఉంటారు. మామూలుగా పనిచేసేవారు ఉంటారు. బొత్తిగా పనిచేయనివారూ ఉంటారు. బాగా పని చేసేవారికి బాగా పనిచేయాలని పార్టీ అధినేత చెప్పక్కరలేదు. 

ప్రజలకు దగ్గరగా ఉండాలని, ప్రజల్లోనే ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించాలని, ప్రజలను ఆకట్టుకొని వచ్చే ఎన్నికల్లో గెలవాలనే కోరిక బలంగా ఉన్నవారు ఆటోమేటిగ్గా బాగా పనిచేస్తారు. అలాంటివారిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒకరు. ఆయన పనితీరుపై మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి.

కుప్పం నుంచి చంద్ర‌బాబును ఓడించ‌డంక‌న్నా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిమ్మ‌ల రామానాయుడును ఓడించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి వైసీపీ చెమ‌టోడ్చాల్సి ఉంటుంద‌న్నారు. రామానాయుడు వైసీపీకి పాల‌కొల్లులో కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. 

2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలుపొందారు. వైసీపీ గాలి ఉధృతంగా వీచిన‌ప్ప‌టికీ 2014 ఎన్నిక‌ల‌క‌న్నా మ‌రింత ఎక్కువ ఓట్ల‌ను నిమ్మ‌ల 2019 ఎన్నిక‌ల్లో సాధించారు. 17,809 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ బాబ్జీపై విజ‌యం సాధించారు. నిమ్మలకు 67,549 ఓట్లు రాగా, డాక్టర్ బాబ్జీకి కేవలం 49,740 ఓట్లు మాత్రమే వచ్చాయి.

జ‌న‌సేన త‌ర‌ఫున పోటీచేసిన గున్నం నాగ‌బాబుకు 32,984 ఓట్లు వ‌చ్చాయి. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌డ‌మే ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్ గా మారింద‌ని, ఈ మూడు సంవ‌త్స‌రాల్లో నియోజ‌క‌వ‌ర్గంలో నిమ్మల త‌న ప‌ట్టును మ‌రింత పెంచుకున్నార‌నే అభిప్రాయం కూడా స్థానికుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. కుప్పంలో చంద్ర‌బాబును ఓడించ‌డంక‌న్నా పాల‌కొల్లులో నిమ్మ‌ల‌ను ఓడించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని, అందుకు ప్ర‌త్యేక వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుందంటున్నారు. 

వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో గెలుపొందిన రామానాయుడు నియోజకవర్గంలో కలియదిరుగుతూ త‌న వ్య‌క్తిగ‌త శైలితో బ‌లం పెంపొందించుకోవ‌డ‌మేకాకుండా పార్టీ బ‌లాన్ని పెంచుతున్నారు. ఈ మూడు సంవ‌త్స‌రాల్లో ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై త‌వ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వం కూడా ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు చేసింది. 

ఒకానొక స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌ర్వాత రామానాయుడి పేరే ఎక్కువగా వినపడిందంటే అతిశయోక్తి కాదు. వైసీపీ తాను నిర్ధేశించుకున్న 175 నియోజ‌క‌వ‌ర్గాల ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందిన సీట్ల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించాలని, ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల ప‌రిస్థితి, వైసీపీ ప‌రిస్థితిపై ఒక నివేదిక రూపొందించుకొని ప్ర‌త్యేక వ్యూహాన్ని అమలు చేయడమే దీనికి పరిష్కారమంటున్నారు.

అప్పుడే రామానాయుడిని ఓడించ‌డ‌టం సుల‌భ‌మవుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. నిమ్మల రామానాయుడు వినూత్నంగా పనిచేస్తున్నారు. పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం  చూడండి.. పాల‌కొల్లులో ప‌నిచేసిన‌ట్లు ప‌నిచేయండి.. పాల‌కొల్లు ఎమ్మెల్యే మోడ‌ల్‌ను మీరు కూడా ఫాలో అవ్వండి.. పాల‌కొల్లులో ఎలా చేశారో రామానాయుడిని అడిగి తెలుసుకోండి.. పాల‌కొల్లులో ఎలా అమ‌లు ప‌రిచారో.. అక్క‌డ ఆయ‌న ఎలా ప‌నిచేస్తున్నారో అడ‌గండి…ఇదీ ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జిలంద‌రికీ చంద్ర‌బాబు నాయుడు చెబుతున్న మాట‌.

ప్రభుత్వంపై నిమ్మల నిరసనలు కొత్తరకంగా ఉంటాయి. ఆయన కొన్ని రోజులు పేపర్ బాయ్ అవతారం ఎత్తారు. ఉదయాన్నే న్యూస్ పేపర్లు సర్ది, ఇంటింటికి సైకిల్ పై వెళ్లి న్యూస్ పేపర్లు వేశారు. వైఎస్ఆర్ సీపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఇలా నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

అందుకే ఇలా పేపర్ బాయ్‌గా మారి.. పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకుని పేపర్లు వేశారు. స్థానికులకు టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. 31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేసిన అనంతరం రామానాయుడు మాట్లాడుతూ.. ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా దినపత్రికలు వేస్తూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వారికి తెలియజేస్తానని తెలిపారు. 

అలాగే, మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని ఎమ్మెల్యే వివరించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌జ‌ల‌కు చేరువయ్యే కార్యక్రమాలే ఆయన నిర్వహిస్తున్నారు. నిత్యం సైకిలెక్కి ఇంటింటికీ తిరుగుతుంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటే మాత్రం ప్ర‌తిరోజు సైకిల్ ఎక్కి ముందురోజు ఎక్క‌డినుంచైతే ఆపారో  అక్క‌డి నుంచి ప్రారంభిస్తారు. దీనిద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌య్యారు. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఆర్థికంగా కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

ఇత‌ర ఎమ్మెల్యేలు, నాయ‌కుల్లా కాకుండా ఆయ‌న చేసే ఒక‌టి రెండు విమ‌ర్శ‌లు కూడా ప్ర‌భుత్వాన్ని చురుక్కుమ‌నేలా త‌గులుతాయి. దీంతోపాటు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విభిన్న రీతుల్లో ముందుకు తీసుకువెళుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో రామానాయుడు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రో పార్టీ పావులు క‌ద‌ప‌డానికి అవ‌కాశం ఇవ్వ‌డంలేదు. తన ప్రత్యర్థులెవరూ బ‌లం పుంజుకోవడానికి అవకాశం ఇవ్వడంలేదు.

నియోజకవర్గం మొత్తంమీద ఆయన పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. చంద్ర‌బాబు సొంతంగా నిర్వ‌హించుకున్న స‌ర్వేలో ప‌క్కాగా గెలిచే నియోజ‌క‌వ‌ర్గాల్లో పాలకొల్లు ముందు వ‌రుస‌లో ఉంది. అంతేకాకుండా నిమ్మ‌ల‌కు తిరుగులేద‌ని, కాబట్టి  ఈ ఫార్ములాను 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లుచేస్తే క‌చ్చితంగా పార్టీ పుంజుకుంటుందని ఆ సర్వే సూచించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేసి పార్టీ నేతలందరిచేత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయించబోతున్నారు. మరి ఈ ఫార్ములా టీడీపీకి విజయం సాధించి పెడుతుందా?