అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగనే కూడదు. రాజధాని అనేది తాము ఇచ్చిన పొలాల్లో మాత్రమే ఉండాలి అనే డిమాండ్ తో ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు వ్యక్తం చేస్తున్న నిరసనలు వెయ్యిరోజులు దాటాయి. ఇంతకాలం నిరసనల పేరుతో రోజూ టెంట్ల కింద కూర్చుంటున్నా.. రాష్ట్ర ప్రశాంతంగా ఉండడం, తమ గోడును ఇతర ప్రాంతాల ప్రజలు పట్టించుకోకపోవడం చూస్తోంటే వారికి భయం వేస్తోంది.
తమ పోరాటానికి కొత్తగా ఏదైనా యాక్షన్ మసాలా దట్టించాలనే కోరిక పుడుతోంది. అందుకోసం కార్యచరణ ప్రణాళికే అరసవిల్లి దాకా పాదయాత్ర. ఈ యాత్రతో వాళ్లు ఏం సాధించాలనుకుంటున్నారు? ఏ లక్ష్యం అందుకోగలం అనుకుంటున్నారు? వారి పాదయాత్ర, తెరవెనుకనుంచి నడిపిస్తున్న చంద్రబాబు కుత్సితాలకు తెరదించి, ఆయననే ఎలా ముంచబోతోంది? తమ సర్కారు ఆలోచన ఏమిటో.. అమరావతి అనేది ఏ రకంగా గ్రాఫిక్స్కు మాత్రమే పరిమితమైన ఒక అసాధ్యమైన స్వప్నమో.. ప్రజలను నమ్మించడంలో ముఖ్యమంత్రి జగన్ ఎలా కృతకృత్యులవుతున్నారు? ఈ కోణాల్లో గ్రేటాంధ్ర సమగ్ర విశ్లేషణ!
అమరావతి లో మాత్రమే రాజధాని ఉండాలనే డిమాండ్ తో సాగుతున్న పోరాటానికి సంబంధించి.. ప్రస్తుత ఎపిసోడ్ మహాపాదయాత్ర. అమరావతి నుంచి అరసవిల్లి వరకు అమరావతి ఉద్యమకారులుయాత్ర సాగిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య రేకెత్తగల అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు అనుమతులు నిరాకరిస్తే.. శాంతియుతంగా చేయదలచుకున్న నిరసన ప్రదర్శన, యాత్రలకు అవకాశం ఇవ్వరా (చేస్తారా లేదా ఇప్పుడే తేలదు) అనే డిమాండ్ తో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరీ యాత్ర కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని డిమాండ్ తో యాత్రలు చేయడం ఇవాళ కొత్త కాదు. అమరావతి రాజధాని అనే పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత.. అక్కడి రైతులుగా చెప్పుకుంటున్న వారు చాలానే యాత్రలు చేశారు.
కాశీ యాత్ర, అమర్ నాద్ యాత్ర, కేదార్ నాధ్ యాత్ర, హస్తినయాత్ర.. ఇలా అనేకం. కొందరు వ్యక్తులు కొన్ని కుటుంబాలు కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం.. దర్శనాలు పూజలు గట్రా అయిన తర్వాత.. అమరావతి రాజధానిగా కావాలి అని ఒక బ్యానర్ పట్టుకుని ఫోటో దిగి… దాన్ని పచ్చ మీడియాకు పంపడం ఒక రివాజుగా చేసేశారు. అందుకే వాళ్ల యాత్రలకు ప్రజల దృష్టిలో విలువ లేకుండా పోయింది. మొత్తానికి తమ యాత్రలకు కూడా విలువ సృష్టించుకోవడానికి తిరుమలయాత్ర చేపట్టారు. అది పాదయాత్ర! గుంటూరు నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం అనేది వారి ప్రకటిత లక్ష్యం. విశాఖలో ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని వెళితే… తిరుపతి వైపు ప్రాంతాల వారికి దూరం పెరుగుతుంది గనుక.. ఈ పాదయాత్రకు బాగానే మద్దతు ఉంటుందని సాధారణ ప్రజలు, తటస్థులు కూడా అనుకున్నారు. కానీ ఆ యాత్రకు అంత సీన్ లభించలేదు.
రాజధాని కోసం పోరాటాలు పూర్తిగా పొలిటికల్ ప్రేరేపితాలుగా మారిపోయిన తర్వాత.. ఈ పాదయాత్ర అడుగుపెట్టిన ప్రతి ఊరిలో తెలుగుదేశం నాయకులు మాత్రం వారికి స్వాగతాలు చెప్పి.. భోజనాలు పెట్టి.. ప్రజల మద్దతు ఉన్నట్టుగా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వారి తైనాతీపార్టీలు కూడా అదే పనిచేశాయి. సోమువీర్రాజుకు అమిత్ షా తిరుపతిలో అక్షింతలు వేసేదాకా దూరంగా ఉన్న బిజెపి, ఆ తర్వాత వారితో కాలు కలిపింది. తీరా తిరుపతి చేరాక అక్కడ చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. ఉద్రిక్తతలు తలెత్తాయి. మూడురాజధానుల అనుకూల ప్రదర్శనలు కూడా జరిగాయి. ఆ ఉద్రిక్తతల మధ్య యాత్ర ముగిసింది. తీరా ఇప్పుడు అరసవిల్లి దాకా మళ్లీ మహా పాదయాత్ర చేస్తున్నారు.
సాధించాలనుకున్నది ఏంటి?
విశాఖకు ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని వచ్చినట్లయితే.. జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అయిన అధికార వికేంద్రీకరణలో భాగంగా.. కొన్ని శతాబ్దాలుగా వెనుకబడి ఉన్న తమ ప్రాంతం అంతో ఇంతో అభివృద్ధిని రుచిచూస్తుందని ఆశపడిన ఉత్తరాంధ్ర నడిబొడ్డు వరకు ఈ అమరావతి పోరాటం చేస్తున్న వారు యాత్ర సాగిస్తున్నారు. విశాఖకు ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని అనే ప్రకటన వచ్చిన నాటినుంచి.. యావత్ ఉత్తరాంధ్ర సంబరాల్లో మునిగిపోయిన మాట వాస్తవం.
అమరావతి పోరాటాలతో భిన్నమైన కోర్టు తీర్పు వచ్చినప్పుడు వారు హతాశులైన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తన ఉక్కు సంకల్పంతో.. ఏదో ఒకరీతిగా మళ్లీ తమ కలలు నిజం చేస్తారని ఎదురుచూస్తున్న మాట వాస్తవం. తమకు రాజధాని, తమకు అభివృద్ధి రాబోతున్నదని కలగంటున్న వారిని.. కేవలం రెచ్చగొట్టడానికే అన్నట్టుగా.. అమరావతి రైతులు అరసవిల్లి వరకు ఈ యాత్ర చేపడుతున్నారు. ఎందుకు? అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది.
తెలుగుదేశం పార్టీ ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. రాజధాని విషయంలో రాష్ట్రం చాలా ప్రశాంతంగానే ఉంది. ఇంత ప్రశాంతంగా ఉండడం వారికి ఇష్టం లేదు. ఒక కార్చిచ్చు రాజేయాలనేది వారి కుట్ర. విశాఖ దిశగా ఈ పాదయాత్ర వెళ్లే కొద్దీ.. వారి యాత్రకు ప్రతిఘటన, ప్రతిబంధకాలు ఎదురౌతాయి. అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. అలా అల్లర్లు జరగడమే వారికి కూడా కావాలి. నెత్తురు చిందాలి.. గొడవలు జరగాలి.. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని.. శాంతియుత ప్రదర్శనల మీద రౌడీలను ఉసిగొల్పారని నిందలు వేయాలి. గగ్గోలు పెట్టాలి. కోర్టులో కేసులు వేయాలి. గవర్నరుకు పితూరీలు చెప్పాలి.. ఇవీ వారి కుట్రలు! అంతకు మించి ఈ యాత్ర ద్వారా అమరావతి కోసం పోరాడుతున్న వారు సాధించేది ఏమీ లేనేలేదు.
ఈ యాత్ర చంద్రబాబును ముంచుతుంది..
ఏ చిన్న రభస జరిగినా దాని ద్వారా రాజకీయ ప్రయోజనం దండుకోవాలనేది చంద్రబాబునాయుడు కుట్ర. తెరవెనుక స్కెచ్ మొత్తం వారిదే అనే సంగతి అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత రాష్ట్ర సారధి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర వాడే. అంతో ఇంతో స్థానికంగా బలం ఉన్న నాయకుడు. ఆ బలాన్ని మొత్తం అమరావతి పాదయాత్రకు మద్దతుగా మోహరించి.. ఉద్రిక్తతలు రేకెత్తితే వాటిని ఘర్షణలుగా, కొట్లాటలుగా దొమ్మీలుగా మార్చాలనేది వారి ప్లాన్. ఇవేవీ ప్రజలు అర్థం చేసుకోలేని విషయాలు కాదు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. ఇలా తెరవెనుకగా అయినా మహాపాదయాత్రకు సూత్రధారిగా నిలవడం ద్వారా రాష్ట్ర ప్రజల ఛీత్కారాలను మూటగట్టుకుంటున్నారు.
ఇన్నాళ్లకు ఉత్తరాంధ్రకు బాగుపడే యోగం వస్తే చూసి ఓర్వలేకపోతున్నాడని.. యావత్ ఉత్తరాంధ్ర చంద్రబాబును ఈసడించుకునే పరిస్థితిని ఆయన ఈ యాత్ర ద్వారా కల్పించుకుంటున్నారు. 2019లో టీడీపీకి దక్కిన కాసిని సీట్లలో ఉత్తరాంధ్ర వాటా బాగానే ఉంది. విశాఖలో అయితే.. మొత్తం నాలుగు అసెంబ్లీలు వాళ్లే నెగ్గారు. ప్రజలు వారిని నమ్మారు. తాము అంతగా నమ్మిన తెలుగుదేశం పార్టీ.. ఇవాళ తమ ప్రాంతం రాజధానికి నోచుకుని బాగుపడుతోంటే చూసి ఓర్వలేకపోతున్నదని.. వారంతా అసహ్యించుకునే పరిస్థితి. జగన్ హవాను తట్టుకుని 2019లో నెగ్గిన అచ్చెన్నాయుడు కూడా ఇలాంటి ఉత్తరాంధ్ర పతనాన్ని వెనుకబాటుతనాన్ని కోరుకునే యాత్రకు మద్దతివ్వడం ద్వారా.. స్థానికంగా తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారనే వాదన కూడా అక్కడ వినిపిస్తోంది.
ఈ యాత్రకు మద్దతు ద్వారా.. గుంటూరుకు ఎగువన ఉన్న అన్ని ప్రాంతాలు.. (పూర్వ) ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర యావత్తూ టీడీపీని అసహ్యించుకోవడం తథ్యం. అయితే.. మిగిలిన ప్రాంతం కూడా వారి రాజకీయ విధానాన్ని అనుమానిస్తోంది. అధికార వికేంద్రీకరణ ద్వారా.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ అంటోంటే.. అందులో చంద్రబాబుకు నొప్పి ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. క్రమంగా.. విపరీతంగా ఆరోపణలు వినిపిస్తున్న మాదిరిగానే ఆయన ఒక కులం కోసమే పనిచేస్తున్నారనే అభిప్రాయం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్లకు కలిగేలా వ్యవహరాలు తయారవుతున్నాయి. చంద్రబాబు పరిస్థితి అలా దిగజారుతోంది. వికేంద్రీకరణను ఆహ్వానించలేని, హర్షించలేని సంకుచిత మనస్తత్వం ఉన్న చంద్రబాబునాయుడు.. మరోసారి అభివృద్ధి అనే మాటెత్తితే కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆ రకంగా ఆయన రాజకీయ వైభవానికి.. ఈ మహా పాదయాత్ర పతనాన్ని నిర్దేశించనుంది.
ప్రజలను నమ్మించిన జగన్
చంద్రబాబు గ్రాఫిక్స్ లో మాయ చేసిన రాజధాని అమరావతిలో రాజధాని అసలు సాధ్యమేనా.. అదంతా కేవలం మాయే కదా.. అనే దిశగా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించడంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. ఆయన శాసనసభ సాక్షిగా చాలా స్పష్టంగా లెక్కలు చెప్పారు. చంద్రబాబు స్వయంగా రాజధాని మౌలిక అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చవుతాయని అన్నారని, ఇప్పటిదాకా అయిదువేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని లెక్కల సహా నిరూపించారు. ఆ రకంగా ఆయన బొమ్మల్లో చూపించిన రాజధాని పూర్తి చేయాలంటే.. ఇంకో వందేళ్లు కూడా చాలవని జగన్ చాటి చెప్పారు. అందరూ టముకు వేస్తున్నట్టుగా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కానే కాదని కూడా.. జగన్ నిరూపించారు.
జగన్ ఏదో ఆషామాషీ వ్యాఖ్యల లాగా ఇదంతా చెప్పలేదు. చాలా సాధికారంగా.. సాక్ష్యంగా, ఆధారాలు, గణాంకాల సహా వివరించారు. తెలుగు ప్రజలు ఇవాళ తమ నాయకుడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు. చంద్రబాబునాయుడు అయిదేళ్ల పాటు కేవలం గ్రాఫిక్స్ మాయ చేశారని వంచించారని నమ్ముతున్నారు. నైతికంగా చంద్రబాబు మరియు పచ్చ మీడియా విషప్రచారాల్ని తిప్పి కొట్టడంలో జగన్ ఆ రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇలాంటి యాత్రలు ఇచ్చే ఫలితాలు ఏమీ ఉండవు. ఒక సంచలనం రేకెత్తించడం, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఒక కార్చిచ్చు రేపడం తప్ప. అయితే ప్రభుత్వం ఇక్కడే సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది. ఈ యాత్ర అదుపుతప్పకుండా చూసుకోవడం పోలీసు యంత్రాంగానికి ఒక పెద్ద సవాలు. ఇది రచ్చ కావడమే యాత్ర చేస్తున్న వారి లక్ష్యం. అందుకే వారు తమ యాత్రలో బౌన్సర్లను పెట్టుకుని మనీ.. ఘర్షణలకు రెడీ అన్నట్లుగా నడుస్తున్నారు. రచ్చ జరగకుండా చూడడం ప్రభుత్వం బాధ్యత. ఈ విషయంలో జగన్ సర్కారు ఎంత అప్రమత్తంగా ఉంటుందో.. ఎంత సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.
.. ఎల్ విజయలక్ష్మి