అదొక చిన్న మలయాళ సినిమా. వచ్చి కూడా 2 నెలలు దాటింది. ఇప్పుడా సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం గీతా ఆర్ట్స్ సంస్థ ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకోవడమే. ఆ సినిమానే నాయట్టు. మలయాళంలో పెద్ద హిట్టవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తోంది గీతా సంస్థ.
ముగ్గురు పోలీస్ అధికారుల చుట్టూ తిరిగే కథ ఇది. వ్యవస్థలో రాజకీయ నాయకులే బలంగా ఉంటారని.. వాళ్లు చెప్పినట్టు వ్యవస్థలోని వ్యక్తులంతా నడుచుకోవాల్సిందే అనే సందేశాన్నిస్తూ సున్నితంగా, విమర్శనాత్కంగా తెరకెక్కించిన సినిమా ఇది.
డిపార్ట్ మెంట్ లో ఉన్న ముగ్గురు పోలీసుల్ని, అక్రమంగా ఓ కేసులో ఇరికించేందుకు డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తులే రెడీ అవ్వడం.. ఈ క్రమంలో ఆ ముగ్గురు పోలీసులు తప్పించుకోవడం, వాళ్ల కోసం మిగతా పోలీసులు వెదకడం.. ఇదీ సింపుల్ గా నాయట్టు కథ. నాయట్టు అంటే వేట అని అర్థం.
స్టోరీలైన్ చూసి ఇదేదో యాక్షన్ ఎడ్వెంచరస్ సినిమా అనుకోవద్దు. సింపుల్ గా ఉంటుంది. కానీ సీట్-ఎడ్జ్ థ్రిల్లర్. సింపుల్ లైన్ కు కూడా స్క్రీన్ ప్లే ఎలా రాయొచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. థ్రిల్ తో పాటు ఎమోషన్, సెంటిమెంట్ కూడా రంగరించి తీసిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ దక్కించుకుంది.
గీతా సంస్థ చేసింది మంచి పనే. ఇలాంటి కథను తెలుగు ఆడియన్స్ కు అందించడం మంచి ప్రయత్నమే. కాకపోతే నిన్నగాకమొన్నొచ్చిన హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోతున్న టాలీవుడ్ లో.. ఈ సినిమాలో కోసం 3 కీలక పాత్రల్ని (అందులో ఒకటి మహిళా పాత్ర) ఎంపిక చేయడం కత్తిమీద సామే. నారప్ప లాంటి రీమేక్ ను హ్యాండిల్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకు ఈ రీమేక్ బాధ్యతలు అప్పగిస్తారేమో చూడాలి.
అన్నట్టు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను జాన్ అబ్రహాం తీసుకున్నాడు. అతడే నటిస్తాడా లేక నిర్మిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోజియమ్ (ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తున్నాడు) హిందీ రైట్స్ ను కూడా జాన్ అబ్రహాం దక్కించుకున్నాడు.