తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ దక్కింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ తో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా, పలు సెక్షన్లలో నమోదైన కేసులతో దేవినేని ఉమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. దేవినేని ఉమ అరెస్టును టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఉమపైనే దాడి చేసి, ఆయనపైనే కేసులు పెట్టారంటూ ఆరోపించింది. అయితే హైకోర్టులో మాత్రం ఉమ తరఫు న్యాయవాది వేరే వాదన వినిపించారు.
ఫిర్యాదిదారుడు కులం తెలియదని, ఫిర్యాదిదారుడు చెప్పినట్టుగా ఏమీ జరగలేదని, పార్టీ మీటింగ్ సందర్భంగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దేవినేని ఉమ అక్కడకు వెళ్లారని అంటూ హైకోర్టులో ఆయన న్యాయవాది వాదించారు. దేవినేనిపై దాడి జరిగిందంటూ మాత్రం ప్రస్తావించలేదు.
అయితే బయట టీడీపీ హడావుడి అంటా దేవినేనిపై దాడి జరిగిందని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వాదించింది. దేవినేని ఉమను జైల్లో హతం చేసే ప్రయత్నం జరుగుతోందన్నట్టుగా టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ అంశంపై రాష్ట్రపతికి, కేంద్ర హోం శాఖ మంత్రికి కూడా దేవినేని ఉమ భార్య లేఖలు రాశారు.
ఇక దేవినేని ఉమను విచారణకు కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారని, ఈ కేసులో విచారించడానికి ఇతరులను అరెస్టు చేయాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనను తిరస్కరిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.