కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రిని అయితే నియమించగలిగారు కానీ, మంత్రి వర్గం విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం అంత తేలికగా ఒక కూర్పుకు రాలేకపోతోంది. ఈ రోజు మధ్యాహ్నం కర్ణాటక మంత్రివర్గ ఏర్పాటు జరుగుతుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలకు కూడా సమాచారం వెళ్లిందని, కొత్త మంత్రివర్గం చేత ప్రమాణం చేయించేందుకు ఏర్పాట్లు అన్నీ చేయాలంటూ ముఖ్యమంత్రి బొమ్మై రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చారట. అయితే ఫైనల్ లిస్టు మాత్రం ఇంకా ఆయనకు చేరలేదని టాక్!
ఫైనల్ లిస్టు పూర్తిగా ఢిల్లీ కనుసన్నల్లో రెడీ అవుతోందని సమాచారం. ఇప్పటికే రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం పెట్టారు బొమ్మై. ఆ సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాల తో ఆయన సమావేశం అయ్యారు. తన కేబినెట్లో ఎవరుండాలనే అంశం గురించి వారి ఆదేశాలను తీసుకుని బొమ్మై బెంగళూరుకు చేరారు.
అసలైన విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలెవరికీ కాల్స్ వెళ్లలేదట. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉండాలంటూ ఎవరికీ సందేశాలు వెళ్లలేదట. మరి కొన్ని గంటల్లో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అనే వార్తలు వస్తున్నా.. ఇంతకీ కొత్త మంత్రులు ఎవరనే అంశం గురించి స్పష్టత లేకపోవడం గమనార్హం. అసలు సీఎం పోస్టు విషయంలోనే ఆఖరి వరకూ క్లారిటీ లేదు. అలాంటిది మంత్రివర్గం విషయంలో అంత తేలికగా స్పష్టత వస్తుందా? అనే చర్చ జరుగుతూ ఉంది.
కర్ణాటక రాజకీయ వ్యవహారాలు పూర్తిగా ఇప్పుడు ఢిల్లీకి మారాయి. యడియూరప్ప తన చివరి ఏడాది పాలన అంతా మంత్రివర్గ విస్తరణ ప్రయత్నాలను చేశారు. కేబినెట్ ను పునర్వ్యస్థీకరించుకోవాలని ఆయన ప్రయత్నించారు. అయితే అందుకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కేబినెట్ విషయంలో పలు సార్లు యడియూరప్ప ఢిల్లీకి వెళ్లి వచ్చినా ప్రయోజనం దక్కలేదు. చివరకు ఆయనను సీఎం సీటు నుంచి దించేశారు.
ఇప్పుడు కొత్త సీఎం కూడా కేబినెట్ లిస్టు విషయంలో ఢిల్లీకి వెళ్లొచ్చారు. సీఎం అంటూ వచ్చారు కాబట్టి, కేబినెట్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని పూర్తిగా బీజేపీ హై కమాండ్ తన కనుసన్నల్లో నడిపిస్తున్న వాతావరణాన్ని తనే స్వయంగా కల్పిస్తుండటం గమనార్హం.