కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఆయ‌నే…

గ‌త కొంత కాలంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌పై నెల‌కున్న ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డిన‌ట్టే. ఇక లాంఛ‌న‌మే మిగిలింది. త‌న త‌ర్వాత చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా తెలుగు వారైన ఎన్వీ ర‌మ‌ణ పేరును ప్ర‌స్తుత…

గ‌త కొంత కాలంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌పై నెల‌కున్న ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డిన‌ట్టే. ఇక లాంఛ‌న‌మే మిగిలింది. త‌న త‌ర్వాత చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా తెలుగు వారైన ఎన్వీ ర‌మ‌ణ పేరును ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర‌న్యాయ‌శాఖ‌కు లేఖ రాశారు. 

సీజేఐ బోబ్డే ప‌ద‌వీ కాలం వ‌చ్చే నెల 23వ తేదీతో ముగుస్తుంది. వార‌సుడి పేరు సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల బోబ్డేకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న త‌ర్వాత సీనియ‌ర్ అయిన ఎన్వీ ర‌మ‌ణ పేరును బోబ్డే ప్ర‌తిపాదించడం గ‌మ‌నార్హం. 

కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 1957, ఆగ‌స్టు 27న జ‌న్మించారు. 1983లో న్యాయ‌వాదిగా ఆయ‌న ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అనంత‌రం ఆయ‌న న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు జ‌డ్జిగా ప‌ని చేశారు.

అనంత‌రం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌దోన్న‌తి పొందారు. ఆ త‌ర్వాత 2014, ఫిబ్ర‌వ‌రి 14 నుంచి  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తిలో అగ్ర‌గ‌ణ్యులు. ఆయ‌న ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్టు 26తో ముగుస్తుంది.  

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ బోబ్డే ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర న్యాయ‌శాఖ పంపారు. కేంద్ర న్యాయ‌శాఖ ఆ ప్ర‌తిపాద‌న‌ను హోంశాఖ‌కు పంపిన‌ట్టు స‌మాచారం. కేంద్ర‌హోంశాఖ ప‌రిశీల‌న అనంత‌రం రాష్ట్ర‌ప‌తికి వెళుతుంది. రాష్ట్ర‌ప‌తి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగినే జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ‌చ్చే నెల 24న దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.