స్కూల్స్ మూసేసి.. థియేటర్లు తెరుస్తారా?

కరోనా దెబ్బతో తెలంగాణవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు మరోసారి మూతబడ్డాయి. ఇవాళ్టి నుంచి పాఠశాలలు బంద్. మరి థియేటర్ల సంగతేంటి..? రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.  Advertisement సినిమా హాళ్లను కూడా మూసివేయాలంటూ…

కరోనా దెబ్బతో తెలంగాణవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు మరోసారి మూతబడ్డాయి. ఇవాళ్టి నుంచి పాఠశాలలు బంద్. మరి థియేటర్ల సంగతేంటి..? రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. 

సినిమా హాళ్లను కూడా మూసివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పూర్తిగా మూసివేయడం కుదరకపోతే గతంలో ఉన్నట్టు 50 శాతం ఆక్యుపెన్సీ విధానాన్ని అయినా అమలు చేయాలని సూచించింది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ పరిశ్రమ నుంచి థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవద్దంటూ అభ్యర్థనలు వస్తున్నాయి.

స్కూల్స్ మూసేసి, థియేటర్లు తెరిస్తే ఒప్పుకుంటారా..?

స్కూల్స్ మూసినా, థియేటర్లు మూసినా.. నిర్వాహకులకు తీవ్ర ఇబ్బందులే. తెలంగాణలో ప్రైమరీ సెక్షన్ మొదలు పెట్టకుండానే స్కూళ్లను పూర్తిగా మూసివేశారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకుల తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారు. ఆన్ లైన్ క్లాసులంటే ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్ పై బతికే చిన్నా చితకా స్కూల్స్ యాజమాన్యాలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాయి. అటు ఆన్ లైన్ క్లాసులు చెప్పలేక, ఇటు అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారు.

అయితే అదే సమయంలో థియేటర్లు తెరచి ఉంచుతామంటే మాత్రం సామాన్య ప్రజలు ఊరుకుంటారా..? చదువే వద్దని చెప్పినప్పుడు, విందులు-వినోదాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. అటు వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం థియేటర్లు కూడా మూసేయాలంటూ ప్రతిపాదనలిచ్చేసింది. ఇటు సినీ ప్రముఖులనుంచి వద్దనే విన్నపాలొస్తున్నాయి.

50 శాతానికే మొగ్గు చూపుతారా..?

షాపింగ్ మాల్స్, థియేటర్లలో ఎవరూ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనేమాట వాస్తవం. మాస్క్ మాయమైపోయింది, భౌతిక దూరం అటకెక్కింది. ఇప్పటికిప్పుడు నిబంధనలు పాటించండి అని కట్టడి చేస్తే కొంతవరకైనా ఉపయోగం ఉంటుంది. అయితే ఇప్పటికే చేతులు కాలే పరిస్థితి వచ్చింది. 

ఇప్పుడు ఆకులు పట్టుకోవడం కంటే నీళ్లు చల్లడమే మేలు. అంటే థియేటర్లు, మాల్స్, జిమ్ లు, వగైరా వగైరా మూసేయాల్సిందే. పోనీ మొహమాటానికి పోతే.. కనీసం 50శాతం ఆక్యుపెన్సీ విధానానికైనా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేలా ఉంది. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో థియేటర్లు, మాల్స్ పై మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.