ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షాల కడుపుతున్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా ప్రభుత్వమే పోషిస్తూ వారికి పనిలేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలంటే ఉద్యమాలు, వీధి పోరాటాలు చేస్తుండడం సహజం.
అప్పుడప్పుడు రాష్ట్ర, దేశ వ్యాప్త బంద్‌లను ప్రతిపక్షాలు చేస్తుంటాయి. వాటిని ప్రభుత్వాలు అడ్డుకునేందుకు ప్రయత్నంలో ప్రతిపక్ష నేతల్ని ఈడ్చి పడేయడాలు, అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు తదితర చిత్రాలు మనకు కనిపిస్తుండేవి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని అవేవీ లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26న అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది.
రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖమంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 26న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు నాని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను సీఎం జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
భారత్ బంద్‌కు బీజేపీ, జనసేన మినహా ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ మద్దతు ఇవ్వకూడదని ప్రతిపక్ష పార్టీలన్నీ లోలోన కోరుకున్నాయి. ఎందుకంటే రైతులు, కార్మికుల వ్యతిరేక పార్టీగా వైసీపీపై ముద్ర వేసి ప్రజావ్యతిరేకత పెంచాలని పరితపించిన ప్రతిపక్షాల ఆశలన్నీ జగన్ సర్కార్ నిర్ణయంతో అడియాసలయ్యాయి.
ఈ మధ్యే రైతులకు మద్దతుగా ఇదే విధంగా బంద్‌కు జగన్ సర్కార్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే నేరుగా బంద్‌లో పాల్గొంటుడడంతో బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకునే శ్రమ ప్రతిపక్ష పార్టీలకు లేకపోయింది. దీంతో ప్రచారం కరువైంది. ప్రతిఫక్షాల ఆశలకు జగన్ సర్కార్ ఈ విధంగా గండికొడుతున్నదన్న మాట.