గట్టిగా అయిదు రోజులు కాలేదు థియేటర్లు తెరచుకుని. మళ్లీ మూతపడబోతున్నాయని వార్తలు అందుతున్నాయి. ఆంధ్ర సిఎమ్ జగన్ పుణ్యామా అని అతి పెద్ద పరిశ్రమ పూర్తిగా ఇబ్బందుల్లో చిక్కుకోపోతోంది. చెబితే వినపడదు.. చూస్తే కనపడదు అనే టైపులో తయారయింది. వ్యవహారం. జగన్ అంతట ఆయన సమస్య తెలుసుకోరు. మూడు రాష్ట్రాల్లో థియేటర్ల వ్యవస్థ కేవలం తన ఒక్క నిర్ణయం వల్ల కుదలేయిందని ఆయన అంతట ఆయన తెలుసుకోరు. పోనీ ఎవరైనా చెపితే వింటారా? అంటే ఆ అవకాశమే ఇవ్వరు.
ఆయన ఏదో మూడ్ లో వుండగా ఓ మంత్రి తెచ్చిన పాత జీవో పట్టుకుని, చటుక్కన ఆదేశాలు ఇచ్చేసారు. ఇప్పుడు వెనక్కు తగ్గాలి అంటే మళ్లీ ఆయనకు నేరుగా చెప్పాలి? కానీ ఎవరు చెబుతారు. మనం తప్పు చేసాం అని చెప్పగల దమ్ము ఎవరికి వుంది. చెబుదాం అని ప్రయత్నించినా జగన్ ఆ అవకాశం ఇవ్వడం లేదు. అపాయింట్ మెంట్ అడిగే ఇండస్ట్రీ జనాలకు అది దొరకదు.
దీంతో సినిమాల విడుదల ఆగిపోయింది. తెగించి కొన్ని చిన్న సినిమాలు గతవారం విడుదలయ్యాయి. రాబోయేవారం మరి కొన్ని విడుదలవుతున్నాయి. ఆ పై వారం ఇక సినిమాలు లేవు. టక్ జగదీష్, లవ్ స్టోరీ, విరాటపర్వం, దృశ్యం 2 లాంటి సినిమాలు ధైర్యం చేయలేకపోతున్నాయి. ఇవన్నీ ఓటిటి లకు ట్రయ్ చేసుకుంటున్నాయి.
మరి థియేటర్లు తెరచిపెట్టుకుని ఏం చేయాలి? అందుకే 13 నుంచి మూసి వేసే ఆలోచనలు చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఈలోగా జగన్ కరుణించి రేట్లు ఇస్తే సరేసరి. లేదంటే ఇక అంతే సంగతులు.
12వ తేదీ నాటికి సెకెండ్ షో అనుమతి వస్తుందని ఆశిస్తున్నారు. దాంతో పాటే రేట్లు కూడా కాస్తయినా మారతాయని ఆశిస్తున్నారు. ఈ రెండూ జరక్కపోతే 13 నుంచి థియేటర్లు వుండకపోవచ్చు. ఇప్పటికే థియేటర్లు కొన్ని శాశ్వతంగా మూతపడ్డాయి. ఎందరో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కానీ ఇవేవీ జగన్ దృష్టికి వెళ్లడం లేదు.
కళ్యాణ మండపానికి నామినల్ అనుమతులు చాలు. ఆపై వారి ఫీజులు వారి ఇష్టం. ఎమ్యూజిమెంట్ పార్కులకు నామినల్ అనుమతులు చాలు. ఆపై వారి ఫీజులు వారి ఇష్టం. పార్క్ హయాత్ లో రెండు వేలకు భోజనం అమ్మవచ్చు. సుబ్బయ్య మెస్ లో 200 కే అమ్మవచ్చు. ఎవరి ఇష్టం వారిది. ప్రభుత్వ కంట్రోలు ఏమీ వుండదు. సామాన్యుడికి సైతం హయాత్ భోజనం అందుబాటులో వుండాలని రేట్లు తగ్గిస్తూ జీవో ఇవ్వరు.
థియేటర్ కు సంబంధించి కరెంటు బిల్లు, ఆస్తిపన్ను, ప్రొఫెషనల్ టాక్స్, జి ఎస్ టి అన్నీ ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. పైగా మినిమమ్ వేజెస్ ప్రకారం జీతాలు ఎలా ఇవ్వాలో నిర్ణయిస్తుంది. ఇవన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతోంది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో జనరేటర్ రన్ చేయాలంటే ఎంతవుతుంది? థియేటర్ కెపాసిటీ ఎంత? నెలకు ఖర్చులు ఎంత? ఆదాయం ఎంత? మిగులు ఎంత? అన్న లెక్కలు కూడా ప్రభుత్వమే కట్టాలి కదా?
సిఎమ్ జగన్ నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. సరైన నిర్ణయం తీసుకోకపోవడం తప్పు. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆధీనంలోని రైల్వే శాఖ సైతం ప్రయాణీకులను దారుణంగా దోపిడీ చేస్తోంది. రైళ్లు అన్నింటినీ స్పెషల్ గా మార్చి, కన్సషన్లు తీసేసి, అదనపు భారం వేసి మరీ టికెట్ రేట్లు వసూలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల్లోని లోపాలను అడ్డంపెట్టుకుని, కోర్టు ఆదేశాలు ఆధారం చేసుకుని ప్రయివేటు బస్సులు చిత్తారాజ్యంగా తిరుగుతున్నాయి. వాటి రేట్లు కంట్రోలు చేస్తూ జీవో ఇచ్చే నాధుడు లేడు.
మొత్తం మీద కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిపోయింది అన్న చందంగా తయాయింది థియేటర్ల వ్యవహారం. అడ్డగోలు రేట్లను కంట్రోలు చేస్తారు అనుకుంటే అసలు థియేటర్లే లేకుండా చేస్తున్నారు.
కొసమెరుపు ఏమిటంటే వైఎస్ ఫ్యామిలీకి కూడా థియేటర్లు వున్నాయి. అటు కడపలోనూ, ఇటు బెజవాడలోనూ. మరి కనీసం వాటి ఉద్యోగులయినా ఆయనకు మొరపెట్టుకుంటే వింటారేమో?
లేదా జగన్ ప్రెస్ సెక్రటరీ అయినా వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఆయన దృష్టి తెచ్చే ధైర్యం చేయాలేమో?