రాసినా, మాట్లాడినా మీ మాటకొక అందం ఉంది, విలువుంది, పరువుంది, బరువుంది. అదే మమ్మల్ని మీకు అభిమానిగా చేసింది. నాలాంటి ఎందరో యువకులు మీరంటే పడి చస్తాం. మీలోని అక్షరబ్రహ్మకి సాష్టాంగపడతాం. సినీ సంభాషణల రచయితగా ఒక మార్క్ సంపాదించుకుని, తర్వాత డైరెక్టరయి అందులో కూడా ఒక చెరపలేని మార్క్ ని సృష్టించుకుని రాజమౌళి గారి స్థాయిలో ఉన్నారు మీరు ఈ రోజు. మీ పట్ల గౌరవమున్న మాకు అదెంతో గర్వకారణం.
గత కొన్నాళ్లుగా ఏదో ఒక అంశం మీద మీపై చిన్న ట్రోల్ చూసినా పిచ్చ కోపం వచ్చేది. ట్రోల్ చేసిన వాడి అడ్రస్ దొరుకుతుందేమో వెళ్లి గొదపెట్టుకుందామనిపించేది. కానీ ఓర్వేలేక ఏడుస్తున్నారులే అని సరిపెట్టుకున్నాను.
ఇంకా ట్రోల్ చేస్తుంటే చిరాకొచ్చేది. క్లాస్ టేస్ట్ లేనివాళ్లు మీ మీద అలానే పడేడుస్తారులే అనుకుని ఊరుకున్నాను.
గత రెండ్రోజులుగా మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఈ సారి కూడా నన్ను నేను ఊరడించుకునే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. ఈ సారి తప్పు మీ వైపే ఉందనిపించింది. అందుకే ఒక అభిమానిగా మీకీ బహిరంగ లేఖ. జీవితంలో ఒక్కసారన్నా మీకు సన్మానం చేసి సన్మాన పత్రం రాయాలకున్నాను. కానీ ఇలా బహిరంగ లేఖ రాసే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు.
“అయ్యప్ప కొషియుం” తెలుగు రీమేక్ కి మీకు దర్శకులు కానప్పుడు సెట్లో మీకు పనేంటి అనేది మీ ట్రోలర్స్ వేసే మొదటి ప్రశ్న.
అవును మీరు దర్శకులు కాదు. ఆ సినిమాకి రచయిత మాత్రమే. రచయిత షూటింగ్ కి రాకూడదని లేదుగా. పవన్ కళ్యాణ్ గారితో మీకున్న దోస్తీ కారణంగా ఎన్ని సార్లన్న రావొచ్చు. రచయిత హోదాలో స్పాట్లో డయలాగ్ ఇంప్రొవైజేషన్స్ కోసమైనా రావొచ్చు. అస్సలు తప్పు లేదు. ఇదే ఆర్గ్యుమెంట్ నేను కొంత మంది ట్రోలర్స్ తో చేసాను.
కానీ వాళ్లు వేలేత్తి చూపేవి వేరే ఉన్నాయి. మీరు దర్శకులైతే మీ రచయితకి సెట్లో ఇంత సీనిస్తారా అని!! అఫ్కోర్స్ మీ సినిమాలకి రచయిత కూడా మీరే అని కూడా వాళ్లకి నచ్చజెప్పాను.
కానీ ఇలా చేయడం వల్ల అసలు దర్శకుడు సాగర్ చంద్ర మబ్బు చాటు చందమామ అయిపోతున్నాడు కదా అనేది వారి ఆర్గ్యుమెంట్. అది నేను ముమ్మాటికీ ఏకీభవించాల్సిన అంశం. సాగర్ కొత్త దర్శకుడేమీ కాదు. అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు లాంటి విషయమున్న సినిమాలు తీసాడు. తనకంటూ ఒక టేస్టుంది, అనుభవముంది. ఒక రకంగా చూస్తే “వకీల్ సాబ్” తీసిన వేణు శ్రీరాం కంటే తక్కువవాడేమీ కాదు. అలాంటిది అతను షూటింగ్ చేస్తున్న సినిమా సెట్లో అసలతను కనపడకుండా పవన్ కళ్యాణ్ గారితో మీరున్న వీడియోల్నే ఎందుకు హైలైట్ చేసుకుంటున్నారు? దీనివల్ల సాగర్ మీద నమ్మకమే కాదు, మీ పరువు కూడా పోతోంది బయట.
మీరొక దర్శకులు. పవన్ గారొక నటుడు. మీ ఇద్దరూకలిసి హిట్లూ కొట్టొచ్చు, ఫ్లాపూ ఇవ్వచ్చు. అంతవరకే ఉండాలి. కానీ ఆయన వెనకాలే తోకలాగ తిరగడం వల్ల మీరు ఆయనకొక పీయేలాగ కనిపిస్తున్నారు చాలామందికి. ఫలితంగా మీరు చీపయిపోతున్నారు.
రామగోపాలవర్మ “పవర్ స్టార్” అనే సినిమా తీసి అందులో పవన్ మీ చెంప మీద కొట్టే సీన్ పెట్టినప్పుడు రక్తం మరిగి ఏం చెయ్యాలో తెలియక ట్విట్టర్లో అతన్ని పచ్చిబూతుల్ని హుందాగా తిట్టాను. ఎంతైనా మీ అభిమానిని కదా. హుందాతనాన్ని వదులుకోలేను. ఇప్పుడనిపిస్తోంది..అతనా సీన్ పెట్టడానికి కారణం కూడా మీరు పవన్ గారితో ఓవర్ ప్రొజెక్ట్ అవ్వడమే.
రాజమౌళిగారు ప్రభాస్ వెనకో, ఎన్ టి ఆర్ వెనకో తిరగట్లేదు కదా. సుకుమార్ గారు రామచరణ్ వెనకో మరొకరి వెనకో నీడలా నడవట్లేదు కదా. మరి మీరెందుకండీ పవన్ గారి వెనక పాలేరులాగ!? ఇలా అన్నానని మాత్రం ఏమీ అనుకోవద్దు. మీ మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవడానికి నాకు మీకింద పని చేసే ఉద్యోగం లేదు కాబట్టి ఈ ధైర్యం చేసాను.
దయచేసి మీరు మీ హుందతనాన్ని కాపాడుకోండి. మీ ఇండివిడువాలిటీని చాటుకోండి. పవన్ కళ్యాణ్ గారు వేరే దర్శకులతో పని చేస్తున్నప్పుడు మీరు దూరకండి. ఆయనతో మీరు తిరిగితే మీ స్టార్డం ఇంకా పెరుగుతుందనే భ్రమలో ఉన్నారేమో. ఉన్నది ఊడుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ పరువు తీసుకోకండి. మా పరువు తీయకండి.
ఇంత చెప్పినా వినకుండా మీరింకా ఇలాగా కొనసాగుతానంటే మీ అభిమానులం లేచి నిలబడి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని హిమాలయాలకో, అస్సాం కో వెళ్ళాలంతే.
తోట మధుసూదన్ – ఒక అభిమాని