యువతి ఫిర్యాదుపై సీనియర్ జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు మూడు రోజులుగా తీన్మార్ మల్లన్న, ఆయన యూట్యూబ్ చానల్‌లో గతంలో పని చేసిన జర్నలిస్టు ప్రవీణ్ మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడం, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించడం చర్చకు దారి తీసింది. అసలేం జరిగిందంటే…
తనపై ఆరోపణలకు తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో దూకుడు ప్రదర్శించాడు. తనపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన జర్నలిస్టుతో కలిసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను తన చానల్‌లో ప్రదర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అందులో ప్రియాంక అనే యువతి ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు బాధిత యువతి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు మంగళవారం రాత్రి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై సోదాలు చేశారు.
మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే మల్లన్నను అరెస్ట్ చేశారా? లేక విచారించి విడిచి పెడతారా? అనే విషయమై ఉత్కంఠ నెలకుంది. మల్లన్న గత కొంత కాలంగా కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చాడు. టీఆర్ఎస్ వ్యతిరేక టీంగా ముద్రపడిన తీన్మార్ మల్లన్న ఎప్పుడెప్పుడు చిక్కుతాడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువతి ఫిర్యాదు ఓ ఆయుధం ఇచ్చినట్టైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.