మీసం త‌ప్ప‌…రోషం క‌రువైంది

ఒక‌ప్పుడు దేశ రాజ‌కీయాల్లో ఆంధ్రా రాజ‌కీయ నేత‌లు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించేవారు. కానీ నేడు మ‌చ్చుకైనా అలాంటి ప‌రిస్థితి లేదు. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలుగా అవ‌త‌రించాయి. ఇంత పెద్ద రాష్ట్రం నుంచి…

ఒక‌ప్పుడు దేశ రాజ‌కీయాల్లో ఆంధ్రా రాజ‌కీయ నేత‌లు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించేవారు. కానీ నేడు మ‌చ్చుకైనా అలాంటి ప‌రిస్థితి లేదు. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలుగా అవ‌త‌రించాయి. ఇంత పెద్ద రాష్ట్రం నుంచి దేశ రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఢిల్లీలో మంగ‌ళ‌వారం కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిర్వ‌హించిన అల్పాహార విందు స‌మావేశానికి 15 ప్ర‌తిప‌క్ష పార్టీలు హార‌య్యాయి. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా బ‌ల‌మైన కూట‌మి ఏర్ప‌డా ల‌నే ఆకాంక్ష దేశ వ్యాప్తంగా ఉంది. కానీ పిల్లిమెడ‌లో గంట క‌ట్టేదెవ‌ర‌నే ప్ర‌శ్న‌కు జ‌వాబు దొర‌కాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో ఆ స‌మావేశానికి హాజ‌రైన వాటిలో ప్ర‌ధానంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన నేత, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్‌ వాదీ పార్టీ, ఎన్సీపీ ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌, వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలున్నాయి. బీజేపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుంది. జ‌న‌సేన‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం వ‌హించే స‌భ్యులు కూడా లేరు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార పార్టీలైన టీఆర్ఎస్‌, వైసీపీల‌పై బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. అలాంటిది బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేరేందుకు టీఆర్ఎస్‌, వైసీపీ, టీడీపీ భ‌యంతో వ‌ణికిపోతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. మోడీకి వ్య‌తిరేకంగా ఆయ‌న దేశ వ్యాప్తంగా పర్య‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో తాను ఓడిపోవ‌డంతో ఇక గ‌ప్‌చుప్‌. అప్ప‌టి నుంచి వీలు దొరికితే చాలు… మోడీని పొగిడేందుకు చంద్ర‌బాబు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక కేసీఆర్ విష‌యానికి వ‌స్తే… ఆరు నెల‌ల‌కో, ఏడాదికో మూడో ప్ర‌త్యామ్నాయ కూటమికి నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ఆవేశంగా ప్ర‌క‌టిస్తారు.

ఆ త‌ర్వాత స‌హ‌జంగానే ఆ విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోతుంటారు. ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే మోడీకి అన‌ధికార మిత్రుడు. మోడీపై ట్విట‌ర్ వేదిక‌గా ఓ ముఖ్య‌మంత్రి విమ‌ర్శిస్తే, తాను త‌ప్పు ప‌ట్టి అభాసుపాలు కావ‌డం తెలిసిందే. ఇలా ఉంది మ‌నోళ్ల వ్య‌వ‌హారం. అందువ‌ల్లే దేశ రాజ‌కీయాల్లో ఏపీ పాత్ర ఏమీ లేకుండా పోతోంది. ఒక‌ప్పుడు తెలుగు వారి పౌరుషం అని మీసం మెలేసి చెప్పేవాళ్లు. ఇప్పుడు మీసం త‌ప్ప రోషం క‌రువైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యంగ్యంగా అంటున్నారు.