ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరించడం…కుదరని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేయడం నూతన పబ్లిక్ సెక్టర్ విధానమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాద్ స్పష్టం చేశారు.
రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటీకరణ గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో నూరు శాతం ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ ఏడాది జనవరి 27న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సీసీఈఏ నిర్ణయం తీసుకున్న అనంతరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వాటాల ఉపసంహణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రిని ఉద్దేశించిన లేఖ ప్రభుత్వానికి చేరిందని చెప్పారు.
ముఖ్యమంత్రి తన లేఖలో వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ ఈ అంశంపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయనకు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.