ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్తగా సామెతలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని అరటి ఆకుతో పోల్చారు. అరటి ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్లి అరటి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకేనని అంటూ సున్నితమైన సమస్యలను ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించరాదని అభిప్రాయపడ్డారు.
నిజమే, చంద్రబాబు చెప్పినదానిలో కొంత సత్యం ఉండవచ్చు. కాని అదే సూత్రం ఆయన అదికారంలో ఉన్నప్పుడు వర్తించదా అన్న ప్రశ్నకు సమాదానం ఆయనే చెప్పాలి. ఎన్నడైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా? అంటే అదేమీ కనబడదు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న టైమ్ లో ప్రతిపక్షాలవారిని ఎక్కడైనా ఆందోళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు, పూర్తి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినట్లు ఆయన పిక్చర్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించడమే ఆశ్చర్యంగా ఉంటుంది.
రాజకీయాలలో ఇంత ఘోరంగా మాట మార్చవచ్చా? ఆలోచన విధానం మారిపోవచ్చా అనిపిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటి? మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై పెట్టిన దాడి కేసులు. ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది తప్పు అయినా, రైటు అయినా, తమవారిని పలకరించడం మర్యాదే. అంతవరకు చంద్రబాబు చేసినదానికి అభ్యంతరం చెప్పనక్కర్లేదు.
ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలలో అరటి ఆకుతో సహా రౌడీ రాజ్యం, పులివెందుల పంచాయతీ ఇలా, డీజీపీ నీచుడు ..అలా అనకూడని మాటలు అంటూ ఆయన అరటి ఆకు సామెత చెబుతున్నారు. చెప్పేటందుకే నీతులు ఉన్నాయని ఒక కవి ఏనాడో చెప్పారు. దేవినేని ఉమా అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చంద్రబాబు అంటున్నారు.
అది నిజమే అయితే రాత్రివేళ వెళ్లడం ఎందుకు? పైగా టిడిపి హయాంలో అక్కడ గ్రావెల్ తవ్వకాలు జరిగాయా? లేదా? ఆ మైనింగ్ జరిగిన చోటు రెవెన్యూ వారిదా? అటవీశాఖ వారిదా? గతంలో ఇదే దేవినేని ఉమా అది రెవెన్యూ భూమి అని చెప్పి ఆనాటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తో స్టే ఇప్పించారా? లేదా? ఆ తర్వాత ఒక క్రషర్ ప్రారంభోత్సవానికి ఉమానే వెళ్లారా? టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆ కొండ లేదా భూమి అంతా అటవీ శాఖది అయిపోతుందా? ఇలాంటివాటికి చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదు.
పైగా ఉమా ఎనిమిదిగంటల సేపు కారులో కూర్చుంటే ఆయనపై కేసు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. అసలు అన్ని గంటలు ఎసి వేసుకుని వాహనంలో కూర్చోవలసిన అవసరం ఏమి వచ్చింది? ఆయనతో తాను కూడా మాట్లాడానని చంద్రబాబు అంటున్నారు. ఉమాకు చంద్రబాబు ఏమి సలహా ఇచ్చారు. తనపై దాడి జరిగిందని అంటున్న ఉమా ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చంద్రబాబు సూచించలేదు.
టీడీపీ మద్దతుదారులను రప్పించి రెచ్చగొట్టడం వాస్తవమా? కాదా? ఇలాంటి ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాదానం ఇచ్చి ఉంటే ఎవరు రౌడీయిజం చేశారో, ఎవరు పులివెందుల పంచాయతీ చేశారో అందరికి తెలిసేది కదా? ఎన్నిసార్లు విమర్శించినా, చంద్రబాబు ఒక ప్రాంతం వారిని అవమానించేలా మాట్లాడడం ఆపడం లేదు. కృష్ణా జిల్లాలో రౌడీయిజమే లేదని ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నారు.
స్వయంగా ఆయన పార్టీ ఎమ్.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు అప్పట్లో రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారిపై దౌర్జన్యానికి దిగినదానిని ఏమి అంటారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ఎమ్మెల్యే గా ఉన్న వంగవీటి రంగాను నడి రోడ్డుమీద హత్య చేసిందెవరు? ఎవరు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని ఇంతవరకు ఎందుకు ఖండించలేకపోయారు? రౌడీయిజం అన్నది ఏదో ఒక జిల్లాకు పరిమితం కాదు.
అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని అసాంఘీక శక్తులు ఉంటాయి. వారు రౌడియిజం చేస్తుంటారు. ఆ రౌడీలను రాజకీయనేతలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటారు. అవన్ని తెలియవన్నట్లు చంద్రబాబు అమాయక ఫేస్ పెట్టి ఇలా మాట్లాడితే నమ్మడానికి జనం చెవిలో పూలు పెట్టుకుని ఉండాలి. ఒకప్పుడు విజయవాడలో రౌడియిజం ఎలా ఉండేదో తెలియని సంగతి కాదు. ఇది పక్కనబెడదాం.
చంద్రబాబు తాను అరటి ఆకు నని, చాలా జాగ్రత్తగా ఉన్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? ఎమ్మార్యో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే ఇదే చంద్రబాబు సి.ఎమ్.హోదాలో ఉండి ఆ మహిళా అదికారినే ఎందుకు మందలించారు. అప్పుడు అరటి ఆకు సామెత గుర్తుకు రాలేదా? చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కొందరిపై లారీలతో డీకొట్టి హత్య చేస్తే, ఆ కేసు నిందితులలో ఎందరిని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయించింది? చంద్రబాబు టైమ్ లో జరిగినంత ఇసుక దందా? మాఫియా ఎప్పుడైనా జరిగిందా? ఆయన ఉండే కరకట్ట ఇంటికి ఆమడ దూరంలోనే కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తవ్వకుపోతున్న వార్తలు సచిత్రంగా వచ్చాయి.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం వంద కోట్ల జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చిందే? గోదావరి పుష్కరాలలో సినిమా షూటింగ్ కోసం వేలాది మందిని గేటు బయటే నిలబెట్టి తన కుటుంబంతో పుష్కర స్నానాలు చేసే సన్నివేశాలు, తదుపరి ఒక్కసారిగా గేటు తీయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన ఘటనను ఏమనాలి? అప్పుడు అరటి ఆకు సామెత గుర్తుకు రాలేదా? సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను, విశాఖలో మత్సకారులను అవమానించినప్పుడు చంద్రబాబుకు ఈ సమెత గుర్తుకు రాలేదా? వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా దళితుడిపై దాడి జరిగితే..ఇంకేముంది ..ఎపిలో దళితులపై దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు టీడీపీ నేతలు దళితుడిపై దాడి చేసినట్లు కేసు వస్తే మాత్రం అక్రమ కేసు అంటున్నారు.
తన పాలన సమయంలో ప్రతిపక్షం ఏదైనా ఆందోళన చేస్తే ముందస్తుగా ఎన్నిసార్లు నిర్భందించలేదు. ప్రత్యేక హోదాపై నిరసనలు చేసే విద్యార్దులను పిడి చట్టం పెడతామని బెదిరించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అప్పుడు అరటి ఆకు సామెత గుర్తుకు రాలేదా? నంద్యాల వైసిపి ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారిపై చేయివేశారని చెప్పి ఆయన మీద ఎస్.సి/ఎస్.టి కేసు పెట్టింది నిజంకాదా?
ఆ తర్వాత ఆయన టీడీపీ చేరగానే పునీతుడు అయిపోయాడని అనలేదా? తాను రౌడీయిజంను సహించబోనని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటానని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉమాను పదే పదే అభ్యర్ధించి వెళ్లిపోవాలని కోరినా, ఎనిమిది గంటలపాటు అక్కడే ఉండి రభస చేస్తే చర్య తీసుకోవద్దని అంటున్నారు.పైగా తన హయాంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా ఉండి, ఇప్పుడు డిజిపిగా ఉన్న గౌతం సవాంగ్ ను పట్టుకుని నీచుడు అని సంభోధిస్తారా? ఇదేనా చంద్రబాబు రాజకీయం.
కాస్త అయినా విజ్ఞతతో వ్యవహరించరా? రాజమండ్రి జైలులో ఉన్న ఉమాకు ప్రాణహాని ఏర్పడిందని ఆయన కుటుంబ సభ్యులతో పిర్యాదు చేయడం కూడా కుట్రగానే కనిపిస్తుంది. లేదా ఈ అంశంపై ఏదో ఒక వివాదం కొనసాగించాలన్న లక్ష్యం కనిపిస్తుంది? ఏది ఏమైనా ప్రభుత్వాలు అరటి ఆకు అనుకుంటే ఇక ఏ పని చేయవు. చేయలేవు. కాని బాద్యతగా ఉండాలని అనడం తప్పు కాదు.
కాని ఉన్నవి, లేనివి ప్రభుత్వానికి పులిమి అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతో చంద్రబాబు కాని, టీడీపీ కాని ఉంటే ఆ అరటి ఆకు సామెత ప్రస్తుతం వారికే వర్తిస్తుందని సంగతి అర్ధం చేసుకోవాలి. ఎవరిని ముల్లు గుచ్చుకుందో, ఎవరి ఆకు చినిగిందో ప్రజలకు అవగతం అవుతూనే ఉంది.
కొమ్మినేని శ్రీనివాసరావు