వైసీపీ పుట్టుకలో ఆయన ఉన్నారు. ఆ పార్టీతో పాటు కొన్నేళ్ళ పాటు ప్రయాణం చేశారు. ఆయన ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ. నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిత్వంలో విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా అయిదేళ్ళ పాటు చక్రం తిప్పిన కొణతాల వైఎస్సార్ మరణాంతరం జగన్ వైపు వచ్చేశారు.
జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ కారణల వల్ల కొణతాల వైసీపీని వీడారు. 2019 ఎన్నికల వేళ టీడీపీ కండువా కప్పుకున్న కొణతాల ఆ పార్టీ ఓటమితో పూర్తిగా రాజకీయాలను వదిలేశారు.
రెండున్నరేళ్ల తరువాత మళ్ళీ ఆయన వార్తలలోకి వచ్చారు. అదెలా అంటే కొణతాల ఫ్యామిలీ చేతిలో ఉన్న దేవాదాయ శాఖ భూములను అధికారులు స్వాధీనం చేసుకుని గట్టి షాక్ ఇచ్చేశారు. అనకాపల్లి శ్రీ సీతారామాంజనేయస్వామి వారికి చెందిన భూములు కొణతలా ఫ్యామిలీ గుప్పిట్లో ఉన్నాయి.
రికార్డుల ప్రకారం అవి దేవాదాయ శాఖకు చెందినా కూడా వాటిని తమ స్వాధీనంలో ఉంచుకుంది కొణతాల ఫ్యామిలీ. చాలా కాలంగా ఇది సాగుతున్నా ఇపుడు జగన్ జమానాలో దేవాదాయ శాఖ అధికారులకు ధైర్యం వచ్చినట్లుంది మరి. అంతే ఆ భూములు మావీ అంటూ ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.
చిత్రమేంటి అంటే ఈ ఆక్రమణ భూములు స్వాధీనం చేసుకుంటున్నపుడు రామభక్తులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని అధికారుల చర్యకు మద్దతు ఇవ్వడం. మొత్తానికి కొణతాల ఫ్యామిలీ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. రాజకీయంగా టీడీపీ మద్దతుతో సౌండ్ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది.