విశాఖ ప్రజలకు రాజధాని అవసరం లేదు. ఇది ఏ సర్వేవో చెప్పిన మాట కాదు, ఏ ప్రజాభిప్రాయ సేకరణో తేల్చిన వ్యవహారం అంతకంటే కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజల మనసుల్లోకి దూరి తాను స్వయంగా తెలుసుకున్న నగ్న సత్యం. విశాఖ జనాలు చాలా మంచి వారు అని ఉబ్బేస్తూనే వారికి రాజధాని ఎందుకు అంటున్నారు చంద్రబాబు.
చంద్రబాబు రాజకీయ గడుసుతనంతో అంటున్న మాటలు విశాఖలో మేధావులతో పాటు విశాఖ అభివృద్ధిని కోరుకుంటున్న వారికి మంటెక్కిస్తున్నాయి. విశాఖవాసులు అంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు అని బాబు గారు సెలవిస్తున్నారు.
విశాఖ ప్రజానీకం ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వారిగా టీడీపీ పెద్దల భావనగా ఉంది కాబోలు. అభివృద్ధి కోరుకోని వారు ఎవరైనా ఉంటారా. అమరావతి అన్నది చంద్రబాబు మెదడులో పుట్టింది. ఇంకా అది ఎక్కడా కార్యరూపం పూర్తి స్థాయిలో చాల్చలేదు. అలాంటి బాబు మానసపుత్రిక అమరావతిని విశాఖ వాసులు మూడవ కన్నుతో చూసి బాగా నచ్చేసి మెచ్చేసుకుని జై రాజధాని అమరావతి అని అంటున్నారుట.
అమరావతి వంటి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తే సీఎం జగన్ దాన్ని ద్వంసం చేశారట. విశాఖలో విజనరీ చంద్రబాబు ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అమరావతిని విశాఖ జనాలు కోరుకుంటున్నారు. ఎంత మంచి వారో కదా అని బాబు తానే అనేసుకుని జనం మాటగా చెప్పేస్తున్నారు.
ఇదిలా ఉంటే విశాఖలో బాబు విజన్ డాక్యుమెంట్ పేరిట చేసిన హడావుడి అంతా జస్ట్ పబ్లిసిటీ కోసమే అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. ముందు టీడీపీ విజన్ సంగతి చూసుకోండి బాబు గారూ అని సలహా ఇచ్చారు. 2024లో టీడీపీ మూసుకునిపోయే స్థితిలో ఉందని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబు విశాఖ బీచ్ లో చేపట్టిన ఈవెనింగ్ వాక్ కి జనాలు ఎవరూ రాలేదని ఆమె విమర్శించారు. ఇదిలా ఉంటే విశాఖ వాసులు రాజధానిగా వద్దు అంటూ బాబు పెద్ద మాట వదిలారు. మరి కావాలని జనాలు ఎక్కడ చెబుతారు, ఎలా చెబుతారు, 2024 వరకూ ఆగలేవా బాబూ అని అంటున్నారు.