స్టార్స్ తో కార్యక్రమాలు నిర్వహించడం 'ఆహా'కు కొత్త కాదు. గతంలో సమంత, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు విశ్వక్ సేన్ వంతు వచ్చింది. ఆహా ఓటీటీతో విశ్వక్ సేన్ కు ఒప్పందం కుదిరింది.
తను 'ఆహా' ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నాననే విషయాన్ని కొన్ని రోజుల కిందట టీజింగ్ గా చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. ఆ పోస్టు చూసి చాలామంది విశ్వక్ పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నారు. కట్ చేస్తే, 'ఆహా'లో గేమ్ షో మేటర్ బయటపెట్టాడు. ఇదొక ఫ్యామిలీ గేమ్ షో అనే విషయాన్ని బయటపెట్టాడు.
విశ్వక్ ప్రకటనతో అంతా అతడ్ని, బాలయ్యతో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే, 'ఆహా'ను బాలయ్యను విడదీసి చూడలేం కాబట్టి. ప్రస్తుతం ఈ ఓటీటీ సంస్థ అంతోఇంతో క్లిక్ అయిందంటే అది బాలయ్య చలవే. అతడు చేసిన అన్ స్టాపబుల్ సీజన్-1 బ్రహ్మాండంగా హిట్టయింది. ఆ దెబ్బతో ఓటీటీ సబ్ స్క్రైబర్లు అమాంతం పెరిగారు. మరి అంతటి క్రేజ్ ను తన ఫ్యామిలీ గేమ్ షోతో విశ్వక్ సేన్ తీసుకురాగలడా అనేది ప్రశ్న.
బాలయ్యకు, విశ్వక్ కు పోలిక కష్టం..
ఈ విషయంలో ముఖ్యంగా 2 లాజిక్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య చేసిన ఇంటర్వ్యూ కార్యక్రమాల్లో బాలయ్యతో పాటు గెస్ట్ గా వచ్చిన స్టార్ కూడా ఎట్రాక్షన్స్ గా నిలిచారు. బాలయ్యకు ఎంత స్టార్ డమ్ ఉందో, గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలకు కూడా అంతే స్టార్ డమ్ ఉంది. దీంతో ఆ కార్యక్రమం సూపర్ హిట్టయింది.
విశ్వక్ సేన్ విషయానికొచ్చేసరికి ఈ రెండు అంశాలు తేడా కొడుతున్నాయి. బాలయ్యతో పోలిస్తే విశ్వక్ సేన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ. బాలయ్య ను యాంకర్ గా చూసి చాలా కొత్తగా ఫీల్ అయిన జనం, విశ్వక్ ను అలాంటి పాత్రలో చూసి అంతే కొత్తగా ఫీల్ అవుతారా అనేది మొదటి ప్రశ్న. ఇక రెండో అంశం. బాలయ్య షోలో కనిపించినట్టుగా విశ్వక్ కార్యక్రమంలో స్టార్స్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే, ఇది ఫ్యామిలీ గేమ్ షో కదా.
ఈ రెండు అంశాల ఆధారంగా చూసుకుంటే అన్-స్టాపబుల్ కు వచ్చినంతగా, విశ్వక్ కార్యక్రమానికి క్రేజ్ రాకపోవచ్చని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే సదరు ఓటీటీ జనాల లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. విశ్వక్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, తమకు పనికొస్తుందని భావిస్తోంది. ఈ కార్యక్రమం కోసం పెట్టిన బడ్జెట్ కు ఎంతమంది సబ్ స్క్రైబర్లు రావాలి, ఎన్ని గంటల వ్యూవర్ షిప్ కావాలనే అంశంపై ఇప్పటికే ఓ టార్గెట్ ఫిక్స్ అయింది. ఆ టార్గెట్ రీచ్ అయితే విశ్వక్ హిట్టయినట్టే. లేదంటే సీజన్-2 ఉండదు.