ఎర్ర మన్ను దిబ్బలు…ఇన్నేళ్ళకు రాజకీయాలకు

ఎర్ర మన్ను దిబ్బలు ఎన్నెన్నో ఊసులు చెబుతాయి. విశాఖ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న భీముని పట్టణానికి సాగర తీరం వెంబడి ఉండే సన్నని రోడ్డు వెంబడి పోతూ ఉంటే తీరానికి అవతల…

ఎర్ర మన్ను దిబ్బలు ఎన్నెన్నో ఊసులు చెబుతాయి. విశాఖ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న భీముని పట్టణానికి సాగర తీరం వెంబడి ఉండే సన్నని రోడ్డు వెంబడి పోతూ ఉంటే తీరానికి అవతల పక్కన ఎర్రమన్ను దిబ్బలు కనిపిస్తాయి. ఎర్రమన్ను దిబ్బల సౌందర్యాన్ని చాలా సినిమాల్లో సినీ కెమెరా పట్టేసి జనాలకు చూపించేసింది. ఒకటా రెండా వందల సంఖ్యలో సినిమా షూటింగ్స్ ఎర్ర మన్ను దిబ్బలను ప్రధాన పాత్రగా చేసుకుని సాగాయి.

మరీ ముఖ్యంగా దర్శకుడు జంధ్యాల అయితే ఎర్ర మన్ను దిబ్బలను అసలు వదిలేవారు కాదు ప్రకృతి రమణీయత అంతా అక్కడే ఉందని ఎంచక్కా చూపించేవారు. జంధ్యాల సినిమాలో ఎర్ర మన్ను దిబ్బలు ముగ్ద మనోహరిగా కనిపిస్తే మరో దిగ్దర్శకుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో డెన్ మాదిరిగా కనిపించేవి. ఫైటింగ్ స్పాట్స్ గా కూడా అగుపించేవి. ఒకరా ఇద్దరా కె బాలచందర్ తో మొదలెడితే దాసరి నారాయణరావు, కె విశ్వనాధ్ వంటి వారు ఎందరో ఇక్కడ షూటింగులు చేశారు. ఎర్ర మన్ను దిబ్బల ప్రాశస్త్యాన్ని సకాల లోకానికి తెలియచేశారు.

అవే ఎర్ర మన్ను దిబ్బలు ఇపుడు రాజకీయ వేదికలుగా మారిపోవడం కాల విచిత్రం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమిలి పర్యటనలో భాగంగా ఎర్రమన్ను దిబ్బలను పరిశీలించారు. రెండు రోజులలో వీటి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని పవన్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఎర్ర మన్ను దిబ్బలకు జియో ట్యాగ్ ఉందని, వాటిని అను క్షణం కాపాడుతోంది తమ ప్రభుత్వమే అని సమాధానం ఇచ్చారు మంత్రి గుడివాడ అమరనాధ్. ఇంతకీ ఎర్రమన్ను దిబ్బలకు ప్రమాదం ముంచుకు వచ్చిందా లేక రాజకీయ వస్తువుగా అవి అర్జంటుగా ఉపయోగపడే టైం వచ్చిందా అన్నదే అర్ధం కావడం లేదు అంటున్నారు. ఎర్ర మన్ను దిబ్బల నుంచి కెమెరాలు సొగసులనే పిండుకునేవారు. ఇపుడు రాజకీయం ఎంత సారవంతంగా పండుతుందో కూడా చూడాల్సిందే.