రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుందని, కొత్తగా వచ్చిన నేతల వల్ల ఇబ్బందులు ఉండవని ఆల్రెడీ ఉన్న నేతలకు పార్టీ అధ్యక్షులు నచ్చ చెబుతూ వచ్చారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పార్టీ ఫిరాయింపుల పర్వంతో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బాగా నష్టపోయింది. ఆ తర్వాత నియోజక వర్గాల పునర్విభజన ఊసేలేదు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ‘ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందిస్తూ …. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు.
రాజ్యంగం లోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతారని ఆయన తేల్చి చెప్పారు. దీంతో నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు.
అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు. కేంద్ర ప్రభుత్వ సమాధానంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో నిరుత్సాహం నెలకుంది. కొత్త నియోజక వర్గాల కోసం మరో పదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని పెదవి విరుస్తున్నారు.