అతిలోక సుందరి శ్రీదేవి తన అందచందాలతో పాటు అద్భుత నటనతో భారతీయ చిత్ర ప్రేమికులపై చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మనల్ని నీడలా వెంటాడుతూనే వుంటాయి. శ్రీదేవి అనే రూపం, నటి ఎప్పటికీ మరిచిపోలేని అద్భుత జ్ఞాపకం. తల్లి వారసురాలిగా జాన్వీకపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
తల్లికి తగ్గ తనయగా ఆమె గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి ముద్దుల కూతురు, చిత్ర పరిశ్రమ ముద్దుగుమ్మ జాన్వీ పెళ్లి ముచ్చట్లు చెప్పడం విశేషం. ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’తో పాటు ఓ దక్షిణాది చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ నటిస్తున్నారు. జాన్వీ పెళ్లి కబుర్లు ఏంటంటే…
‘ రెండు మూడు రోజుల్లో పెళ్లి తంతు ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్ బోట్‌లో నా గ్యాంగ్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాక… తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకూ వరుడు ఎలాంటి వాడై ఉండాలనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… కాబోయేవాడు తెలివితేటలున్న వాడైతే చాలని సూటిగా చెప్పారామె.
మొత్తానికి అమ్మ జ్ఞాపకాలతో పెళ్లి తంతు ముగించాలనే భావన ఆమె మనసులో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే దక్షిణాదిలో పెళ్లి, అక్కడి సంప్రదాయ చీర, మెహందీ తదితర సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆలోచించడం అంటే… అమ్మ పట్ల ఆమె ప్రేమకు నిదర్శనంగా చెబుతున్నారు.