తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపిందెవరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కచ్చితంగా తెలుసునని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు విషయమై ఘాటు ఆరోపణలు చేయడం గమనార్హం.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి…వీరంతా నిందితులైతే కీలక సాక్షి అయిన రంగన్న నేరుగా వైఎస్ జగన్కు చెబితే కేసు వెంటనే అయిపోతుంది కదా అని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి రెండేళ్ల సమయం కావాలా? అని బీటెక్ రవి నిలదీశారు. తన చిన్నాన్న హత్య కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ దర్యాప్తు నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ రెండు అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. అసలు నిందితులను తప్పించేందుకు సీఎం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ విమర్శలు గుప్పించారు.
పులివెందులలో సునీల్ యాదవ్ లాంటి సాధారణ వ్యక్తులు వైఎస్ కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేసి తిరిగే పరిస్థితి ఉందా అని బీటెక్ రవి ప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డి భయపెడితే భయపడేవాళ్లు పులివెందులలో ఎవరూ లేరని ఆయన అన్నారు.
సీబీఐ విచారణాధికారులకు తన పేరు చెబితే చంపేస్తానని ఎర్రగంగిరెడ్డి తనను బెదిరించినట్టు రంగన్న ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.