వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తొలి అరెస్ట్..!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు అనుమానితుల్ని ప్రశ్నించి, కొన్నిసార్లు వారిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు తొలిసారిగా పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ని అరెస్ట్…

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు అనుమానితుల్ని ప్రశ్నించి, కొన్నిసార్లు వారిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు తొలిసారిగా పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ని అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్ కొన్నిరోజులుగా పరారీలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతని కోసం గాలింపు చేపట్టిన అధికారులు గోవాలో అరెస్ట్ చేసి, అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచి, ట్రాన్సిట్ రిమాండ్ పై కడప సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు.

సునీల్ విచారణ సందర్భంలోనే ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు కిరణ్ యాదవ్ ని కూడా సీబీఐ ప్రశ్నించింది. విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా సునీల్ పరారీలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. చివరికి అతడ్ని సీబీఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేయడం గమనార్హం.

మరోవైపు ఇతర అనుమానితులపై సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో వివేకా ప్రధాన అనుచరుడు, ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి ప్రశ్నిస్తున్నారు అధికారులు. దస్తగిరి, అతని భార్య షబానాను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి ఆ తర్వాత వదిలిపెట్టారు.

వైఎస్ వివేకా వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారడంతో, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ఇప్పటి వరకు 1600మందిని సీబీఐ విచారణ పేరుతో పిలిపించింది.

2019 మార్చి 14 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత ఇంటిలోనే హత్యకు గురయ్యారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఇదే కేసులో మరో సిట్ ఏర్పాటైంది. వీటిని కాదంటూ.. వివేకా భార్య, కుమార్తె, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మార్చిలో సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ కొత్తగా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. గతంలో సిట్ దర్యాప్తులో కొంతమందిని అరెస్ట్ చూపించారు. ఇప్పుడు సీబీఐ, సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ తో తొలి అడుగు వేసింది.