చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాను ఏ తేదీకి రిలీజ్ చేయాలనుకుంటే ఆ తేదీ లాక్ అయిపోతోంది. ఆచార్య యూనిట్ కంటే ముందే ఇతర సినిమాలు చకచకా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నాయి. దీంతో ఆచార్యకు మంచి డేట్ దొరకడం కష్టం అయిపోయింది.
ఇక మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్ అనుకున్న టైమ్ లో, ఇప్పుడు ఆ అవకాశం కూడా చిరంజీవికి లేకుండా చేశాడు అల్లు అర్జున్.
ఆచార్య సినిమాను క్రిస్మస్ బరిలో దించాలనేది ఆచార్య యూనిట్ కు ఓ ఆలోచనగా ఉంది. అంతలోనే పుష్ప సినిమాను క్రిస్మస్ కు విడుదల చేస్తున్నట్టు బన్నీ ప్రకటించేసి షాక్ ఇచ్చాడు. పుష్ప ది రైజ్ పార్ట్-1 ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు కొద్దిసేపటి కిందట ప్రకటించాడు.
ఇంతకుముందు ఆచార్య సినిమాను సంక్రాంతికి అనుకున్నారు. అంతలోనే పవన్, ప్రభాస్ తమ సినిమాల్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించి కర్చీఫ్ లు వేసేశారు. ఇక మిగిలింది దీపావళి, క్రిస్మస్ మాత్రమే. సో.. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చే క్రిస్మస్ కు రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంది యూనిట్. అంతలోనే బన్నీ ఇలా కర్చీఫ్ వేసి ఆచార్య టీమ్ ను డైలమాలో పడేశాడు.
ప్రస్తుతానికి ఆచార్యకు మిగిలింది దీపావళి అకేషన్ మాత్రమే. అది తమిళ జనాలకు సెంటిమెంట్ డేట్, తెలుగు జనాలకు కాదు. అందుకే మన దగ్గర దీపావళికి పెద్ద సినిమాలు పెద్దగా రావు. కానీ ఇప్పుడు ఆచార్యకు అది తప్ప మరో అకేషన్ లేదు. ఇంకా ఆలస్యం చేస్తే, ఆ తేదీ కూడా చేజారిపోవడం ఖాయం.