తెలుగులో ఫ్లాపులు, హిట్, డిజాస్టర్లు అన్నీ చూసేసిన తరువాత హిందీ లో ఎంట్రీ ఇస్తున్నాడు హీరో బెల్లకొండ శ్రీనివాస్. గతంలో రాజమౌళి-బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాను వివి వినాయక్ డైరక్షన్ లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సినిమాలు లేని వివి వినాయక్ కు కూడా హిందీలో ఇదే తొలి సినిమా.
బాలీవుడ్ సినిమా కావడంతో ఇప్పటి నుంచీ ప్రచారం స్టార్ట్ చేసేసినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే హీరో బెల్లంకొండ కాస్త ఎక్కువ కబుర్లే చెబుతున్నారు. అవి భలే గమ్మత్తుగా వున్నాయి కూడా.
'రాజమౌళి నన్ను చూసి, అచ్చం ప్రభాస్ మాదిరిగా వున్నావు అని అన్నారు. దాంతో నాకు కాన్పిడెన్స్ పెరిగింది' అన్నాడు బెల్లంకొండ. అంతే కాదు, మారిన కాలానికి అనుగుణంగా ఛత్రపతి సినిమాలో కొన్ని మార్పులు చేసామని, ఛత్రపతి ని మించి భారీ స్థాయిలో సినిమాను తీస్తున్నామని కూడా వెల్లడించాడు.
సాధారణంగా రీమేక్ అన్నది కత్తి మీద సాము. యూ ట్యూబ్ లో ఇప్పటికే ఛత్రపతిగా ప్రభాస్ ను చూసేసారు. పైగా రాజమౌళి పెర్ ఫెక్ట్ స్క్రిప్ట్ ను అల్లేసారు. ఇప్పుడు దాంట్లో మార్పులు చేసినా, ప్రభాస్ ను ఏ మాత్రం మ్యాచ్ చేయకపోయినా తేడా వస్తుంది.
అందువల్ల ప్రీ పబ్లిసిటీ మీద కన్నా ముందు ఆ విషయాల మీద దృష్టి పెట్టాలేమో?