తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ ప్రమాదకరం

మాతృభాషాభిమానం ఉండాలి కానీ అది వెర్రితలలు వేసి కడుపుకొట్టుకునేలా ఉండకూడదు. ఒక పక్క ఆంధ్రలో అసలు తెలుగు మీడియం బడులే వద్దని ఎత్తేస్తే ప్రధాన మంత్రి మాత్రం పూర్తిగా వ్యతిరేక దిశలో ఏకంగా ఇంజనీరింగ్…

మాతృభాషాభిమానం ఉండాలి కానీ అది వెర్రితలలు వేసి కడుపుకొట్టుకునేలా ఉండకూడదు. ఒక పక్క ఆంధ్రలో అసలు తెలుగు మీడియం బడులే వద్దని ఎత్తేస్తే ప్రధాన మంత్రి మాత్రం పూర్తిగా వ్యతిరేక దిశలో ఏకంగా ఇంజనీరింగ్ కూడా ప్రాంతీయ భాషల్లో చదవొచ్చని కొత్త టాపిక్ లేపారు. 

తెలుగు మీడియంలో ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియమైన ఇంజనీరింగ్ లో చేరిన ఎందరో 1990 ల నాటి ఇంజనీర్లు ఎంత కష్టపడ్డారో వారికే తెలుసు. అయినా కష్టపడి ఆ నాలుగేళ్లు చదివిన చదువే ఆ తర్వాత వారికి విదేశాలకెళ్లడానికి తలుపు తెరిచింది. అసలు ముందు నుంచీ ఇంగ్లీష్ మీడియమయ్యుంటే ఆ కష్టం తప్పుండేది అని ఎందరో ఎన్నారైలు సైతం ఆ పాత రోజులు ఇప్పటికీ తలచుకుంటారు. ఆ తరం అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బలంగా ఉంటే తప్ప అమెరికాలాంటి దేశాలు ఆదరించవు. 

అయినా ఎంతసేపూ టెక్నికల్గా నోరు మూసుకుని పని చేసుకునే ఉద్యోగాల్లోనే మనవాళ్లు నాలుగు డాలర్స్ సంపాదించుకుంటున్నారు గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ తో కూడుకున్న ఉద్యోగాలు చేసి సుందర్ పిచాయ్ లాగ, సత్య నాదెళ్ల లాగ కుబేరుల్లాంటి జీతాలు తీసుకునే తెలుగు మీడియం చదువుల వాళ్లు ఎంతమందున్నారు? అలాంటి పొజిషన్స్ ఇంగ్లీష్ మీడియం తోనే సాధ్యం. ఇంగ్లీష్ మాట్లాడడంలో ఎంత నైపుణ్యం ఉంటే అంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 

అంతర్జాతీయంగా ఉన్నతస్థానాల్లో కూర్చోవడానికి ఆ భాష దోహదపడుతుంది. ఇదంతా ఆలోచించే వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి బలవంతపు ఇంగ్లీషు మీడియం చదువులకి జెండా ఊపింది. అలాగని తెలుగు వాచకమే లేకుండా పోతుందని కాదుగా..! మాతృభాష ఎలాగో పాఠ్యాంశంగా ఉంటుంది. అయినా ఇదేదో ప్రాంతీయభాషపై దాడి అన్న చందంగా మాట్లాడారు చాలామంది. వారిలో 99% మంది తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించినవాళ్ళే. 

ఇక మనవాళ్లు మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడూ అనే మాట ఒక్కటే. చైనా, జెర్మనీ, జపాన్ దేశస్థులు వాళ్ల భాషల్లోనే చదువుకుంటున్నారు..మరి వాళ్లు ఉన్నతంగా లేరా అని. లోకజ్ఞానం తెలియని నూతిలో కప్పలు బెకబెకమంటున్నట్టుగా ఉంటుంది ఇలాంటివి వింటుంటే. ఇంగ్లీషులో బలంగా లేకపోవడం వల్ల తాము అనుకున్న విధంగా ప్రపంచాన్ని కబ్జా చెయ్యలేకపోతున్నామని భావించి చైనాలో ప్రాధమిక విద్య నుంచి ఇంగ్లీష్ కంపల్సరీ చేసారు. 

అంటే మరికొన్నేళ్లల్లో చైనాలో ఇంగ్లీష్ మాట్లడలేని వాళ్లు, అర్థం కాని వాళ్లు ఉండరు. అదలా ఉంచితే అసలు చైనాలో ఇంగ్లీష్ లేకుండా కేవలం మ్యాండరిన్ లోనో, కాంటనీస్ లోనో చదువుకుంటే ఆ దేశంలో విపరీతమైన ఉద్యోగావకాశాలున్నాయి. ఆ వ్యవస్థ మనకెక్కడ? ఎమ్మెన్సీలమీద బతుకుతున్న ప్రైవేట్ వ్యవస్థ మనది. ఇంగ్లీష్ రాదంటే నేర్చుకుని చేరమంటారు ఉద్యోగాల్లో. 

జర్మనీ, జపాన్ వాళ్లు కూడా అంతే. తమ దేశాల్లోని ఉద్యోగాలతో తృప్తి చెందుతున్నంతవరకు పర్వాలేదు. ఒకవేళ వాళ్లు ఏ అమెరికాలోనో, కెనడాలోనో మంచి భవిష్యత్తుందనుకుంటే నానా తిప్పలు పడి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. 

నరేంద్ర మోదీగారు ఈ విషయాలన్నీ ఆలోచించారో లేదో. ఏదో రాజకీయాంశంగా ఇన్నాళ్లూ హిందూత్వం, రామాలయం మీద నడిపిన పార్టీని ఇప్పుడు ప్రాంతీయభాష ప్రాతిపదిక మీద కూడా నడపాలనుకుంటున్నట్టున్నారు. తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ వరకు చదివితే లోకల్ గా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో ముందు సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే మిగతాది. 

ఇన్ని ప్రాంతీయ భాషల్లోకి ఆ ఇంజనీరింగ్ పుస్తకాలన్నీ తర్జుమా చేసి, అచ్చేసి, ఆ తెలుగు టర్మినాలజీ తెలిసిన అధ్యాపకుల్ని తయారు చేసుకుని విద్యార్థుల మీదకి వదలడమంటే దేశాన్ని తిరోగమనంగా పరుగెత్తించడం తప్ప మరొకటి కాదు. 

ఈ తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ అనే ఉచ్చులో విద్యార్థులు పడ్డారంటే ఇక వాళ్లని ఎవ్వరూ కాపాడలేరు. ఇది మాత్రం సత్యం. 

– సుజాతాదేవి లక్కావజ్ఝల