ఫస్ట్ వేవ్ తర్వాత బడా సినిమాలన్నీ వరుసగా తన రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అన్ని సినిమాలు తమ విడుదల తేదీల్ని ప్రకటించి సందడి తీసుకొచ్చాయి. కట్ చేస్తే, సెకెండ్ వేవ్ వచ్చింది.
ప్రకటించిన రిలీజ్ డేట్స్ అన్నీ మరుగున పడిపోయాయి. ఆ తేదీలు వరుసగా వస్తున్న ప్రతిసారి ఆ సినిమాలు గుర్తుకురావడం మొదలయ్యాయి. దీంతో గతంలో ప్రకటించిన తేదీలకే తమ సినిమాలకు సంబంధించి కొత్త విషయాలు చెప్పడం, లిరికల్ వీడియోలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఉదాహరణకు పుష్ప సినిమానే తీసుకుందాం. ఈ సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తామన్నారు. కానీ కరోనా కారణంగా ఆ తేదీకి ఈ సినిమా రావడం అసంభవం. మరో 10 రోజుల్లో 13వ తేదీ వస్తోంది. మరి ఆ తేదీకి ఏం చేయాలి. అందుకే విడుదల తేదీని అలా వదిలేయకుండా, ఆ రోజున పుష్ప ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది యూనిట్. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక సినిమాను క్రిస్మస్ లో విడుదల చేయబోతున్నారు.
కేజీఎఫ్-2 విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాను జులై 16న విడుదల చేస్తామని గ్రాండ్ గా ప్రకటించారు. కానీ మరోసారి లాక్ డౌన్ కారణంగా సినిమా రెడీ అవ్వలేదు. దీంతో ఆ రోజున తమ సినిమా నుంచి మరో లుక్ ను విడుదల చేసి యష్ అభిమానుల్లో ఆనందం నింపింది యూనిట్.
ఇక రాధేశ్యామ్ యూనిట్ అయితే ఇంకాస్త వినూత్నంగా ఆలోచించింది. ఏ తేదీకైతే తమ సినిమా రావట్లేదో, సరిగ్గా అదే తేదీకి తమ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. లెక్కప్రకారం ఈ సినిమా జులై 30కి రావాలి. అప్పటికి సినిమా సిద్ధం కాలేదు. దీంతో సరిగ్గా జులై 30నే కొత్త విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ థియేటర్లలోకి వస్తుందని తెలిపారు.
ఇలా పాత తేదీలన్నీ పోయి.. ఆ స్థానంలో కొత్త విడుదల తేదీలు, లిరికల్ వీడియోలు వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో మరోసారి సందడి కనిపిస్తోంది. మూడో వేవ్ ప్రభావం లేకపోతే, ఈసారి అనుకున్న తేదీలకే అన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తాయి.