అవార్డుల విషయంలో సినిమాలకు ఎక్కడిక్కడ ఉండే నిబంధనల్లో కొన్ని కామన్ ఉంటాయి. ఫలానా అవార్డు ఇవ్వాలంటే ఫలానా విధంగానే సదరు సినిమా రూపొందించి ఉండాలనే రూల్స్ ఉంటాయి. అలాంటి సినిమాలనే అవార్డుల విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రూల్స్ విషయంలో ఆస్కార్స్ తో మొదలుపెడితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల వరకూ దేనికదే ప్రత్యేకం.
సాధారణంగా తెలుగులో రీమేక్ సినిమాలకు అవార్డులు ఇవ్వరు. నంది అవార్డుల విషయంలో ఈ రూల్ ను దాదాపు ఫాలో అవుతారు. అయితే కొన్ని సార్లు లాబీలు బలంగా పని చేస్తాయి. అలాంటప్పుడు 'నువ్వే కావాలి' వంటి రీమేక్ సినిమాకు కూడా నంది అవార్డులు దక్కాయి! రామోజీ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో రీమేక్ అయినప్పటికీ నువ్వేకావాలికి అవార్డులు దక్కాయి. అలాంటి లాబీయింగ్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు!
ఆ సంగతలా ఉంటే.. ఆస్కార్ అవార్డుల విషయంలో ఇప్పుడు ఇండియా సినిమా పేర్లు ప్రచారంలో పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ రేసుకు పంపుతారని, కేజీఎఫ్ 2కు ఏం తక్కువ? అంటూ వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలను ఇండియన్ ఎంట్రీలుగా ఆస్కార్ కు పంపడమే పరువు తక్కువ పని! ఈ విషయాన్ని ఆఖర్లో అంతా ఒప్పుకుంటారు. నూటికి నూరు శాతం ఆస్కార్ ఇండియా ఎంట్రీ స్క్రీనింగ్ కమిటీనే వీటన్నింటినీ కాదని.. ఏదో చిన్న సినిమాను ఆస్కార్ రేసుకు పంపుతుంది. బాహుబలి పార్ట్ వన్ విడుదల అయిన ఏడాది తమిళ సినిమా విసారణై ఆస్కార్ కు వెళ్లింది! ఇండియా లెవల్లో జరిగే ఫిల్టర్ లోనే ఇలాంటి ఔట్ కమ్ వస్తుంది.
మరి ఆర్ఆర్ఆర్ ప్రత్యేకం.. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి పేర్లనూ ఆస్కార్ కు పంపుతారనే వాదన వినిపిస్తోంది. మరి పంపితే పంపారు.. ఇంతకీ ఫారెన్ కేటగిరి సినిమాలో ఒక ఉత్తమ చిత్రానికి ఆస్కార్ ను అయితే ఇస్తారు, మరి ఫారెన్ కేటగిరీలో నటీనటులకు అవార్డులను ఇచ్చే సంప్రదాయం ఆస్కార్స్ లో ఉందా? అనేది చెక్ చేసుకోవాల్సిన అంశం.
మరి ఈ ప్రశ్నకు సమాధానం.. నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్స్ లో నటీనటులకు కూడా అరుదుగా ఆస్కార్ ను ఇచ్చిన దాఖలాలున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటులను తలదన్నే ప్రదర్శనను ఇచ్చిన సందర్భాల్లో వేరే భాషల్లో రూపొందిన సినిమాల్లోని నటులకు ఆస్కార్ ఇచ్చారు. అయితే .. అవి అలాంటిలాంటి సినిమాలు కావు!
పూర్తిగా వేరే భాషలో రూపొందిన సినిమాల్లో.. ఆస్కార్ ను అందుకున్న వాడిగా చెప్పుకోదగిన పేరు రాబర్టో బెనిగ్నీది. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా *లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్*. ఇదో ఇటాలియన్ సినిమా. ఈ సినిమాకు సర్వం బెనిగ్నీనే. ప్రపంచ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల అరాచకాలకు బలైన ఒక యుధు కుటుంబం కథ ఇది. విషాధాంతం అయిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిదాయకంగా, ఫన్ తో సాగుతుంది. ఈ సినిమాలోని సీన్లనే దర్శకరచయిత త్రివిక్రమ్ అనేక సార్లు కాపీ కొట్టారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో బెనిగ్నీ ప్రేక్షకుడిని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. సినిమా చూసిన ఎన్ని రోజులైనా తనను మరిచిపోనివ్వడు! అందుకే ఆ ఇటాలియన్ నటుడు తన ఇటాలియన్ సినిమాతో ఇంగ్లిష్ అనువాదం కూడా లేకుండా ఆస్కార్ ను పొందాడు. బెనిగ్నీ నటనకు ఆస్కార్ చిన్నదే!
ఇక నాన్ ఇంగ్లిష్ ఫెర్మామెన్స్ లలో మరింతమంది కూడా ఆస్కార్ లు పొందారు. అయితే ఆ సినిమాలు ఏదో కారణం చేత వేరే భాషల్లో రూపొందించినవే. దాదాపు అంతా హాలీవుడ్ మేకర్లే ఆ సినిమాల వెనుక ఉంటారు. జర్మన్ భాషలో రూపొందిన ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వంటి సినిమాలో నటనకు గానూ క్రిస్టోఫర్ వాల్ట్జ్ కు ఆస్కార్ దక్కింది. అయితే ఇది పేరుకు జర్మన్ సినిమానే కానీ, ప్రధాన నటులు, దర్శకుడు అంతా అమెరికన్లే. అంతా హాలీవుడ్ బృందమే. నాన్ ఇంగ్లిష్ ఫెర్ఫార్మెన్స్ లకు ఆస్కార్ అంటే.. ఈ తరహావే ఎక్కువే! మరి ఆర్ఆర్ఆర్ నటులుకు ఆస్కార్ దక్కితే.. బెనిగ్నీ తర్వాత ఇదే వీళ్లే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారు!