''కమ్మ''ని బంధం వీడిపోయింది. ఏబీఎన్ ఛానెల్ నుంచి వెంకటకృష్ణ అనూహ్యంగా బయటకొచ్చారు. కాదు,కాదు.. గెంటేశారు అంటారు కొందరు. బయటకొచ్చాడా.. గెంటేశారా అనే చర్చను పక్కనపెడితే.. అసలు ఎందుకు వెంకటకృష్ణ ఉద్యోగం పోయిందనేది ఇక్కడ చర్చనీయాంశం. దీనికి ఆ ఛానెల్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లోనే ఆసక్తికర సమాధానాలు దొరుకుతున్నాయి.
ఎక్కువమంది అంగీకరిస్తున్న వాదన విషయానికొస్తే.. ఓ స్కామ్ కు సంబంధించిన వార్తను తొక్కిపెట్టడం కోసం వెంకటకృష్ణ ఓ వ్యక్తి (ఇతడు కూడా టీడీపీ వాడే) నుంచి 50 లక్షలు డిమాండ్ చేశారు. అయితే సదరు వ్యక్తి ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని ఆధారాలతో సహా రాథాకృష్ణకు సమర్పించాడు. అలా వెంకటకృష్ణ ఉద్యోగం పోయిందంటున్నారు చాలామంది.
అయితే ఇక్కడే కొంత అనుమానం పొడసూపుతోంది. ఎందుకంటే.. వెంకటకృష్ణపై అవినీతి ఆరోపణలు కొత్తకాదు. పైకి నిజాయితీగా కనిపించే ఈటీవీ-2 ఛానెల్ లో ఉన్నప్పుడే వెంకటకృష్ణ తన అవినీతిని స్టార్ట్ చేశారనే ఆరోపణలున్నాయి. బెదిరింపులతో ఓ ఫ్లాట్ ను తన పేరిట రాయించుకున్నారనేది కెరీర్ ప్రారంభంలో ఆయనపై వచ్చిన ఆరోపణ.
అక్కడ్నుంచి వరుసపెట్టి ఛానెల్స్ మారినప్పటికీ, వెంకటకృష్ణ వ్యవహార శైలి మారలేదంటారు చాలామంది. టీవీ5, 6-టీవీలో ఉన్నప్పుడు కూడా ఆయనపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకటకృష్ణపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి తెలియకుండానే ఆయనకు రాథాకృష్ణ ఉద్యోగం ఇచ్చారని ఎవ్వరూ అనుకోరు. మరి వెంకటకృష్ణ ఉద్యోగం ఎందుకు పోయింది..?
చెప్పు దాడి ఇక్కడివరకు తెచ్చిందా?
కొన్నాళ్ల కిందటి సంగతి. చర్చలకు పెట్టింది పేరైన వెంకటకృష్ణ అమరావతి భూములపై, రైతుల ఉద్యమంపై ఎప్పట్లానే మరో చర్చ పెట్టారు. ''గ్రాఫిక్స్ ను పూర్తిచేద్దాం'' అంటూ ఆయన పెట్టిన డిస్కషన్ లో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగింది.
ఈ దాడి జరుగుతున్నప్పుడు యాంకర్ గా పక్కనే ఉన్న వెంకటకృష్ణ, దాన్ని ఆపలేదంటూ వాదిస్తోంది బీజేపీ. అలాంటిదేం లేదు, చర్చావేదిక నుంచి దాడిచేసిన వ్యక్తిని బహిష్కరించాం అంటూ ఆ మరుసటి రోజు సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్నారు వెంకటకృష్ణ.
అయితే ఆ ఎపిసోడ్ నుంచే వెంకటకృష్ణ మెడపై కత్తి వేలాడింది. బీజేపీ నేత స్థానంలో మరో పార్టీ నేత ఉంటే వ్యవహారం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. దాడి జరిగింది బీజేపీ నేతపై కావడంతో రాధాకృష్ణపై ఒత్తిడి పెరిగింది. బీజేపీతో ఆచితూచి వ్యవహరిస్తున్న రాథాకృష్ణ సమయం కోసం ఎదురుచూశారు. వెంకటకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే అతడ్ని తొలిగించారంటూ వాట్సాప్ గ్రూపుల్లో మరో ఆసక్తికర ప్రచారం సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితేంటి?
ప్రస్తుతానికి వెంకటకృష్ణ శెలవుపై మాత్రమే ఉన్నారు. ఆయన్ని ఉద్యోగం నుంచి తొలిగించింది వాస్తవమే అయినప్పటికీ ఇంకా ఆయన తన రాజీనామాను సమర్పించలేదు. చర్చలు జరిపి తిరిగి వెనక్కి తీసుకొస్తారా లేక శెలవులు పూర్తయిన తర్వాత అట్నుంచి అటే పంపిస్తారా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై వెంకటకృష్ణ స్పందించారు. “ఒక ప్రయాణం.. ఎన్నో మజిలీలు, సవాళ్లు వుంటాయి..ప్రస్తుతానికైతే సెలవు మాత్రమే.. అంతకు మించి ఏమైనా వుంటే త్వరలో నేనే చెప్తా.” అంటూ ట్వీట్ చేశారు. కొందరు శునకానందంతో ట్రోల్స్ చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారు.
వెంకటకృష్ణ వ్యవహారంపై ఒక్కో పార్టీ జనాలు తలో రకంగా స్పందిస్తున్నారు. పవన్ కు అన్యాయం చేసిన వాళ్లకు ఎవరికైనా ఇదే గతి పడుతుందని జనసేన కార్యకర్తలు ఆత్మసంతృప్తి పొందితే.. జగన్ కు వ్యతిరేకంగా ఇన్నాళ్లూ చేసిన అసత్య ప్రచారానికి ప్రతిఫలమే ఇదంటూ వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అన్ని మజిలీలు, అన్ని సవాళ్లు మేనేజ్ చేసిన మీరు దీన్ని ఎందుకు మేనేజ్ చేయలేకపోయారంటూ కొందరు సెటైర్లు వేస్తే.. ఇకనైనా న్యూట్రల్ గా ఉండమంటూ మరికొందరు సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు, 23 అనే సంఖ్యకు ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపోల్స్ వరకు బాబును ఈ సంఖ్య వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు బాబుకు మీడియాలో వెన్నుదన్నుగా ఉన్న వెంకటకృష్ణ వ్యవహారం కూడా 23వ తేదీనే బయటపడడం యాధృచ్ఛికం.